తీరంలో అలజడి


గార: శుక్రవారం ఉదయం 8 గంటలు... సుమారు 5వేల మంది ప్రజలు నివసించే బందరువానిపేట సముద్ర తీరం...  వేకువజామున వేటకు వెళ్లే మత్స్యకారుల పడవలు తీరానికి మరి కొద్ది నిమిషాల్లో చేరుకుంటాయనగా... ఒక్కసారిగా అలలు పెరుగుతూ బందరువానిపేట వైపు దూసుకొచ్చింది. సముద్రానికి బందరువానిపేట 150 మీటర్లు దూరంలో ఉండగా సుమారు 70 మీటర్లు మేర అలలు వచ్చి ఎగసిపడ్డాయి.

 

ఇలా రెండు గంటలపాటు అలల ఉధృతి  కనిపించి, తరువాత సాధారణ స్థితికిచేరుకుంది. ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో చేపల ప్లాట్‌ఫాం వద్ద ఉన్న రక్షణ గోడ దాటి 5 మీటర్ల మేర భూమికి కోతకు గురయ్యింది. ప్లాట్‌ఫారం నుంచి రక్షణ గోడ వరకు ఉన్న సిమెంట్ రోడ్ కూడా విరిగిపోయింది. అంతేకాక రక్షణ గోడ కిందినుంచి సముద్రం నీరు చొచ్చుకుపోయి భూమిని కోసేసింది. అప్రమత్తమైన మత్స్యకారులు పడవులను ఒడ్డుకు చేర్చుకున్నారు.  నీలం, లైలా, హుద్‌హుద్ తుపాన్ సమయాల్లో కూడా ఇంతమేర అలల ఉధృతి చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు.

 

అలలు ఇలా ముందుకు రావడం ఎప్పుడూ చూడలేదు


 ఇంతలా అలలు ముందుకు రావడం నేను ఇంతవరకూ చూడలేదు. అలలు రావడమే కాకుండా రక్షణ గోడను సైతం దాటి భూమి కోత జరిగింది. ఆ కొద్ది గంటల సేపు సముద్రం వైపు చూస్తే భయమేసింది. అయినా గ్రామస్తులకు ధైర్యం చెబుతూ వచ్చాను.

 -కోడ లక్ష్ముయ్య, మత్స్యకార నాయకుడు, బందరువానిపేట

 

 హుద్‌హుద్‌లోనూ ఇంత తీవ్రంగాలేదు


 హుద్‌హుద్ తుపాన్ బీభత్సం సృష్టించినా ఇంత పెద్ద అలలు ఇలా ముందుకు రాలేదు. పైగా రక్షణ గోడ దాడటంతో పాటు ఇసుక దిబ్బల వద్ద కోతకు గురవుతున్నాయి. పటిష్టమైన రక్షణ గోడను నిర్మించాలి. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి.

 -డి సందెయ్య, బందరువానిపేట

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top