భక్తుడిపై టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది దాడి

భక్తుడిపై టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది దాడి - Sakshi


స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమం



సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడిపై టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది దాష్టీకం ప్రదర్శించారు. పిడిగుద్దులు గుద్దడంతో కుప్ప కూలిన ఆ భక్తుడు ప్రస్తుతం స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పద్మనాభం(65) కుటుంబసభ్యులతో కలసి ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు  శ్రీవారి దర్శన క్యూలైన్లలోకి వెళ్లారు. పొరపాటున మహిళా భక్తులు వెళ్లే స్కానింగ్‌ కేంద్రం నుంచి వెళ్లబోతుండగా.. అక్కడి విధుల్లోని మహిళా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారిమధ్య వాగ్వాదం జరిగింది. పద్మనాభంపై ఇద్దరు మహిళా సిబ్బంది తోపాటు మరో ఎస్‌పీఎఫ్‌ సెక్యూరిటీ గార్డు దాడిచేసి తీవ్రంగా కొట్టారు. దీంతో కుప్పకూలిన పద్మనాభాన్ని అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతిలోని స్విమ్స్‌ కి తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పద్మనాభం బంధువుల ఫిర్యాదు మేరకు తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  



దాడి జరగలేదు: టీటీడీ విజిలెన్స్‌ అధికారులు

శ్రీవారి దర్శనానికి వచ్చిన పద్మనాభంపై ఎలాంటి దాడి జరగలేదని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా క్యూలైన్లలోకి రావటంతో అడ్డుకున్న మహిళా సెక్యూరిటీకి, పద్మనాభానికి వాగ్వాదం జరిగిందని తెలిపారు. ఆ సందర్భంగా అతడికి తీవ్ర రక్తపోటు రావటంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీన భక్తుడు పద్మనాభం శ్రీవారి దర్శనానికి వెళ్లే సీసీ కెమెరా దశ్యాలను టీటీడీ అధికారులు బుధవారం రాత్రి విడుదల చేశారు. వీటిలో భక్తుడిపై దాడిచేసిన దశ్యం కనిపించలేదు. దాడిచేసిన దశ్యాలను ఎడిట్‌ చేసి విడుదల చేశారని బాధితుడి బంధువులు ఆరోపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top