స్వామీ.. కొబ్బరికాయతో సర్దుకో

స్వామీ.. కొబ్బరికాయతో సర్దుకో - Sakshi


కర్పూరం, అగర్‌బత్తీల్లేవు

అసంపూర్తిగా మొక్కులు

ఇష్టారాజ్యంగా టీటీడీ కౌంటర్ నిర్వహణ


 

తిరుమల: టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా శ్రీవారి భక్తులు అసంపూర్తిగా మొక్కులు చెల్లించాల్సి వస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా సాక్షాత్తు టీటీడీ కౌంటర్లలోనే కర్పూరం, అగర్‌బత్తీల్లేకుండా కొబ్బరికాయ మాత్రమే విక్రయిస్తున్నారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం భక్తులు అఖిలాండం వద్ద కర్పూరం, అగర్‌బత్తీలతో కొబ్బరికాయ సమర్పిస్తుంటారు. వీటిని ప్రయివేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయకుండా టీటీడీ కౌంటర్లు ఏర్పాటు చేసింది. గతంలో రూ.10కే కర్పూరం, అగర్‌బత్తీలు, కొబ్బరికాయ ఇచ్చేవారు. ఇటీవల దాని ధరను రూ.15కు పెంచారు. ఆలయ, మార్కెటింగ్ విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కౌంటర్ భక్తులకు అందుబాటులో ఉండటం లేదు. టీటీడీ కౌంటర్లలో కొబ్బరికాయలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎప్పుడు నిలిపేస్తారో తెలియదు. వచ్చే కొబ్బరికాయలు కూడా పిడికిలిలోకి సరి పోతున్నాయి. అదీ కేవలం కొబ్బరి కాయ మాత్రమే ఇస్తున్నారు. అగర్‌బత్తీ, కర్పూరం ఇవ్వటం లేదు. అదేమంటే స్టాకు లేదనే సమాధానం వస్తోంది. దీంతో భక్తులు కేవలం కొబ్బరికాయతో అసంపూర్తిగా మొక్కులు చెల్లించి ఆవేదనతో తిరిగిపోతున్నారు.



 ప్రైవేట్ వ్యక్తులతో టీటీడీ సిబ్బంది చేతివాటం

 కొబ్బరికాయల కౌంటర్‌లో అవకతవకలకు అవకాశం లేకుండా శ్రీవారి సేవకులతో విక్రయిస్తున్నారు. ఆ కౌంటర్లను టీటీడీ కింది స్థాయి సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. వారు పట్టించుకోకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. బోర్డులో సూచించిన ప్రకారం రూ.15 కర్పూరం, అగర్‌బత్తీలు కూడా ఇవ్వాలని అడిగిన భక్తులను దుర్భాషలాడుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సకాలంలో కౌంటర్‌కు స్టాకు తెప్పించటంలోనూ విఫలమవుతున్నారు. గత్యంతరం లేక భక్తులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద కర్పూరం, అగర్‌బత్తీలు అధిక ధరలకు తీసుకోవాల్సి వస్తోంది. ప్రైవేట్ వ్యక్తులతో కౌంటర్ సిబ్బంది చేతులు కలపటం వల్లే ఇలాంటి పరిస్థితి ఉందని విమర్శలున్నాయి.

 

ఈవోగారు కౌంటర్‌పై         దృష్టిపెట్టండి


 భక్తుల మనోభావాలతో కూడిన టీటీడీ కొబ్బరికాయల కౌంటర్ నిర్వహణ రోజురోజుకూ దిగజారుతోంది. ఫలి తంగా ధార్మిక సంస్థ ప్రతిష్ట మరింత దిగజారుతోంది. పట్టించుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా టీటీడీ ఈవో సాంబశివరావు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top