రూ.2,530 కోట్లతో టీటీడీ బడ్జెట్

రూ.2,530 కోట్లతో టీటీడీ బడ్జెట్

  • స్పెసిఫైడ్ అథారిటీ ఆమోదం

  • సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం 2015-2016 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,530.10 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఖరారు చేసింది. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఈ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 2,401.69 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా, ఆర్థిక సంవత్సరం అంతానికి సవరించిన అంచనాల మేరకు బడ్జెట్ రూ. 2,452.51 కోట్లుగా పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలను శుక్రవారం టీటీడీ ప్రజా సంబంధాల విభాగం తెలిపింది.

     

    వసూళ్లు, వ్యయం ఇలా...



    2015-2016 ఆర్థిక సంవత్సరంలో హుండీ ద్వారా భక్తులు సమర్పించే కానుకలు రూ. 905 కోట్లురావచ్చని అంచనా వేశారు. పెట్టుబడులపై వడ్డీ రూ. 744.91 కోట్లు, దర్శన టి కెట్ల విక్రయం ద్వారా రూ. 215 కోట్లు, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ. 50 కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 145 కోట్లు, గదుల అద్దె ద్వారా రూ. 98.5 కోట్లు రావచ్చని అంచనావేశారు. తలనీలాల విక్రయం ద్వారా రూ. 200 కోట్లు, బంగారు డాలర్ల విక్రయంతో రూ. 15 కోట్లు, సెక్యూరిటీ డిపాజిట్లు, ఉద్యోగుల రుణాలపై వడ్డీతో రూ. 37.39 కోట్లు, దుకాణాలు, హోటళ్ల అద్దెలు, టోల్‌గేట్ ప్రవేశ రుసుం, పుస్తక విక్రయం, ఇతర ఆదాయాల ద్వారా 119.30 కోట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా ఉద్యోగుల జీతాల కోసం రూ. 482 కోట్లు, పెట్టుబడులకు రూ. 681.24 కోట్లు, వివిధ కార్యక్రమాల అమలు, శాఖల నిర్వహణ కోసం షుమారు రూ. 1,366 కోట్లు కేటాయించారు.

     

    వెంకన్న ఖజానాకు ప్రభుత్వం ఎసరు



    టీటీడీ ఖజానాకు రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెట్టింది. రాష్ట్రంలోని 20 వేల చిన్న ఆలయాల నిర్వహణ, వాటిలో సిబ్బంది జీత భత్యాల కోసం టీటీడీ రూ.100 కోట్లు ఇవ్వాలని పేర్కొంటూ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 20న జీవో జారీ చేసింది. ఈ మేరకు 2015-2016  ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్లు కేటాయించేందుకు స్పెసిఫైడ్ అథారిటీ పచ్చజెండా ఊపింది. కాగా ఇప్పటికే ప్రతిఏటా కామన్‌గుడ్ ఫండ్ పేరుతో రూ.15 కోట్లు, ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ పేరుతో రూ.10 కోట్లు, అర్చకుల వెల్ఫేర్‌ఫండ్ కోసం మరో రూ.50 లక్షలు ప్రభుత్వానికి టీటీడీ సమకూరుస్తోంది. ప్రభుత్వ పరిధిలోకి వచ్చే రోడ్లు, విద్య, వైద్యం, ఆస్పత్రుల నిర్వహణకు కోట్లాది రూపాయల భారాన్ని టీటీడీ తన భుజాన వేసుకుంది. ఇటీవల తెలుగుగంగ నీటి కోసం రూ.25 కోట్లు కూడా కేటాయించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top