ట్రస్ట్ ఫైట్

ట్రస్ట్ ఫైట్ - Sakshi

  • దుర్గగుడి ట్రస్టుబోర్డు ఏర్పాటుకు సర్కారు కసరత్తు

  •  అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

  •  చైర్మన్‌గిరీ కోసం టీడీపీ, బీజేపీ పోటాపోటీ

  • సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి ట్రస్టుబోర్డు నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ట్రస్టుబోర్డు పదవుల్ని  అధికార పార్టీలోని నిరుద్యోగ నేతలకో, కార్యకర్తలకో కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలో అటు టీడీపీ నేతలు, ఇటు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నేతలు పదవులపై కొండంత ఆశతో పావులు కదుపుతున్నారు.

     

    ఈసారి 12 మందికి అవకాశం



    ప్రతిసారీ దేవస్థానం పాలకమండలిలో తొమ్మిది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. వారిలో ఒకరు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేనాటికి గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నియమించిన కమిటీ దుర్గగుడి వ్యవహారాలను చూస్తోంది. ఒకసారి బాధ్యతలు చేపట్టిన కమిటీ రెండేళ్లు అధికారంలో ఉండవచ్చు. లేదా తగిన కారణం చూపి ప్రభుత్వం కమిటీని రద్దుచేయవచ్చు.



    ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం గత పాలక మండళ్లను రద్దుచేసింది. దీనిపై కొన్ని మండళ్ల సభ్యులు కోర్టును ఆశ్రయించగా, సభ్యుల సంఖ్య పెంచాలన్న యోచనలో సర్కారు ఉంది. రాష్ట్రంలోని పాలకమండళ్ల సభ్యుల సంఖ్యను 9 నుంచి 12కు పెంచుతూ ప్రభుత్వం తయారుచేసిన ఆర్డినెన్స్ గవర్నరు వద్ద పెండింగ్‌లో ఉంది. దానికి గ్రీన్‌సిగ్నల్ రాగానే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు ట్రస్టుబోర్డులు నియమిస్తారని దేవాదాయ శాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆశావహుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.

     

    పట్టుబిగిస్తున్న బీజేపీ



    కేంద్రంలో టీడీపీకి అవకాశం కల్పించి, రాష్ట్ర ప్రభుత్వ మంత్రి పదవుల్లో వాటా తీసుకున్నట్లుగానే నామినేటెడ్ పదవుల్లోనూ తమకు వాటా కావాలని కమలనాథులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా దుర్గగుడి ట్రస్టుబోర్డులో స్థానం పొందగోరే వారు దర ఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు బీజేపీకి చెందినవారే కావడంతో కనీసం సగం సీట్ల కోసం పట్టుబట్టాలని, చివరికి నాలుగైనా దక్కించుకోవాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ఒకేసారి కమిటీలను వేస్తే దుర్గగుడి లాంటి కీలక ఆలయాల చైర్మన్‌గిరీ కోసం బీజేపీ నేతలు పట్టుబట్టే అవకాశం లేకపోలేదు.

     

    చాపకింద నీరులా టీడీపీ



    తెలుగుదేశం నేతలు చాపకింద నీరులాగా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తర్వాత వాటి పరిశీలన, నాయకుల సిఫార్సులు..  ముఖ్యమంత్రి పరిశీలన అన్నీ పూర్తయ్యాక అర్హులైన వారికి పదవులు కేటాయిస్తే అప్పుడు జీవో జారీ అవుతుంది. ఈ తతంగమంతా వేగంగా చేసినా నెల రోజులు పడుతుంది. ఈలోగా ఆశావహులు దుర్గగుడితోపాటు ఇతర దేవాలయాల పదవుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.



    దుర్గగుడి చైర్మన్ కోసం నగరంలోని ఒక బలమైన సామాజికవర్గం నేత ప్రయత్నిస్తుండగా, ముఖ్యమంత్రి సొంత సామాజికవర్గం నాయకులు కూడా తెరపైకి వస్తున్నారు. సుదీర్ఘ కాలం పార్టీకి సేవ చేసినవారికి అవకాశం కల్పించాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. లక్షలు ఖర్చు చేసేవారికి, నేతల పక్కన తిరిగే వారికి కాకుండా పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి తగిన అవకాశం కల్పించాలని ప్రజాప్రతినిధులు అంటున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top