తమ్ముళ్ల కుమ్ములాట

తమ్ముళ్ల కుమ్ములాట - Sakshi


సాక్షి ప్రతినిధి, విజయనగరం : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపీలో  పోరు మొదలైంది. ఇది రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒకర్నిఒకరు దెబ్బతీసుకునే యత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ పదవిని ఆశించినవారు అధికంగా ఉన్నప్పటికీ కోల్డ్‌వార్ మాత్రం టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీ రాజు, చీపురుపల్లి టీడీపీ ఇన్‌చార్జి కె.త్రిమూర్తులరాజు మధ్య జరుగుతోంది.

 

తాము కూడా రేసులో ఉన్నామని గద్దేబాబూరావు, భంజ్‌దేవ్, తెంటు లక్ష్మునాయుడు పరోక్ష సంకేతాలు పంపిస్తున్నారు.  గతంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్రశాఖ అధ్యక్షునిగా పనిచేసి, ప్రస్తుతం టీడీపీ ఆరోగ్య విభాగం ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా  డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ కూడా అశోక్ గజపతిరాజును కలిశారు. చంద్రబాబునాయుడికి తనబయోడేటాను పంపించారు.   

 

టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీ రాజు, చీపురుపల్లి ఇన్‌చార్జి కె.త్రిమూర్తులురాజు, డాక్టర్ వి. ఎస్.ప్రసాద్ మధ్య ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రస్థాయిలో వార్ జరుగుతోంది. దీంతో వీరు ఒకరిపై ఒకరు గుర్రుగా ఉన్నట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నమ్ముకొని పనిచేశామని, కార్యకర్తలను కాపాడామని ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీ రాజు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకే పోస్టుకు పోటీ పడటంతో వీరిద్దరి మధ్య ఆగాదం ఏర్పడింది. ఇందులో జగదీష్, ఐవీపీ వర్గీయులు రకరకాల వాదనలు విన్పిస్తున్నారు.

 

ద్వారపురెడ్డి జగదీష్ ఇప్పటికే లబ్ధిపొందారని, పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్ గిరీని తన భార్యకు దక్కించుకున్నారని, ఇంకా పదవులు ఆశించడం సరికాదని ఐవీపీ వర్గీయులు వాదిస్తున్నారు. ఐవీపీ కూడా నోరు విప్పి అడుగుతున్నారు. ఎప్పుడూ తాను పదవుల కోసం పనిచేయలేదని, అయితే ఈసారి తనకు కాకుండా వేరొకరికి ఎమ్మెల్సీ ఇవ్వడం భావ్యం కాదని ఐవీపీ కార్యకర్తల వద్ద అంటున్నారు. దీనికి స్పందనగా ద్వారపురెడ్డి కూడా తన అనుచరుల వద్ద తన వాదన వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి, అధ్యక్ష పదవికి యడ్ల రమణమూర్తి రాజీనామా చేసిన తరువాత పార్టీ పూర్తిస్థాయిలో నిస్తేజంలో పడిందని, ఆ నేపథ్యంలో తాను అధ్యక్ష పదవిని చేపట్టి పార్టీని జిల్లాలో గెలిపించానని ద్వారపురెడ్డి చెబుతున్నారు. అనుచరుల చేత కూడా అదే మాట అన్పిస్తున్నారు. తన భార్య పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అయ్యారు కదా అంటూ ఐవీపీ వర్గీయులు చేస్తున్న వాదనలపై కూడా తన అనుచరుల చేత గట్టిగా బదులిప్పిస్తున్నట్టు తెలిసింది.  

 

అయితే వీరికి తానేమీ తక్కువ కాదని, ద్వారపురెడ్డి, ఐవీపీ కంటే తనకే ఎమ్మెల్సీ పదవిని అలంకరించే అర్హత ఉందని చీపురుపల్లి నియోజకవర్గ నేత కె.టి.త్రిమూర్తులరాజు వాదిస్తున్నారని సమాచారం. ఎన్నికల సమయంలో తనకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తామనే హామీని కూడా హైకమాండ్ నుంచి వచ్చిందని నాటి విషయాలు గుర్తుచేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పార్టీ టిక్కెట్టు ఇవ్వనప్పుడు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశానని, దీనికి అశోక్‌గజపతిరాజు, కిమిడి కళావెంకటరావు వచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత నీకు ఏదోఒకటి చూస్తామని హామీ ఇవ్వడంతోనే నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు అనుచరుల వద్ద చెప్పుకొస్తున్నారు.  ఉన్నది ఒకే ఎమ్మెల్సీ పదవి కావడం దానికి తానే అర్హుడనని కేటీఆర్ తన అనుచరుల వద్ద చెప్తున్నట్లు తెలుస్తోంది.

 

అయితే కేటీఆర్‌కు చెక్ పెట్టేలా మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు కూడా పోటీ పడుతున్నారు. పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉందంటూ ఆయన రంగంలోకి దిగారు.  సామాజిక అస్త్రాన్ని ప్రయోగించి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. దీంతో కేటీఆర్‌కు సొంత నియోజకవర్గంలోనే సెగ పెట్టినట్టు అయింది. ఇక, ఎన్నికల్లో ఓడిపోయిన భంజ్‌దేవ్, తెంటులక్ష్మునాయుడు కూడా పోటీ పడుతున్నారు.  స్థానికంగా పార్టీ పట్టు సాధించాలంటే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, పార్టీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నట్టు సమాచారం. ఇప్పటికే అధినేతకు తమ ఆకాంక్షను   తెలియజేసినట్టు పార్టీ వర్గాల్లో విన్పిస్తోంది. డాక్టర్ వి.ఎస్. ప్రసాద్ కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.

 

ఈ విధంగా ఎమ్మెల్సీ పదవి విషయంలో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు ఎక్కువవుతోంది. ఎవరికి వారు అశోక్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ఇంతవరకు బయటపడలేదు. పదవి కావాలని కోరేవారిపై చిర్రెత్తిపోతున్నారు. మనసులో మాటను చెప్పుకోవడానికి కూడా అవకాశమివ్వడం లేదు. దీంతో ఏ ఒక్కరిలోనూ ధీమా కన్పించడం లేదు. కానీ అంతర్గతంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top