ట్రిపుల్ ఐటీలకు అటానమస్

ట్రిపుల్ ఐటీలకు అటానమస్


వేంపల్లె :  రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీలకు అటానమస్ (స్వయంప్రతిపత్తి) కల్పించినట్లు చాన్సలర్ అడ్వయిజర్ వై.కృష్ణారెడ్డి తెలిపారు. మూడు ట్రిపుల్ ఐటీలను సమానంగా అభివృద్ధిపరచాలన్నదే ప్రధాన లక్ష్యమని తెలిపారు. సోమవారం ఆయన ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో విలేకరులతో మాట్లాడారు. ఆగస్ట్ 16వ తేదీనుంచే ట్రిపుల్ ఐటీలకు స్వయంప్రతిపత్తి కల్పించినట్లు తెలిపారు. కృష్ణాజిల్లాలోని నూజివీడు, కడప జిల్లాలోని ఇడుపులపాయ, తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలు ఆర్‌జీయూకేటీ పరిధిలో ఉండేవన్నారు.

 

  ఆగస్ట్ 4వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్‌జీయూకేటీ ప్రధాన కార్యాలయంలో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ట్రిపుల్ ఐటీలకు స్వయంప్రతిపత్తి కల్పించేందుకు చాన్సలర్ రాజిరెడ్డి, వైస్ చాన్సలర్ రాజ్‌కుమార్, రిజిష్ట్రార్ సోమయ్య నేతృత్వంలో సమావేశం జరిగిందన్నారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆగస్ట్ 16వ తేదీనుంచి ట్రిపుల్ ఐటీలకు స్వయంప్రతిపత్తి కల్పించినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. గతంలో ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా యూనివర్శిటీ అనుమతి తీసుకుని అక్కడ బిల్లు పాసైన తర్వాతనే మొత్తం వచ్చేదన్నారు.

 

  ప్రస్తుతం ఆ పరిస్థితి ఉండదన్నారు. పర్యవేక్షణ యూనివర్శిటీ పరిధిలో ఉన్నప్పటికి ఆయా ట్రిపుల్ ఐటీలే స్వయంగా నడుస్తాయన్నారు. ఇందుకు సంబంధించి మూడు కమిటీలు ఉంటాయన్నారు. అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్, ఫైనాన్షియల్ అటానమీలు ఉంటాయన్నారు. ఇందుకోసం అధికారులను కూడా నియమించారన్నారు. ఇన్‌ఛార్జి డెరైక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి, ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా కె.ఎల్.ఎన్.రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విశ్వనాథరెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్‌గా ప్రభాకర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ కో.ఆర్డినేటర్‌గా డి.వి.రావులను నియమించినట్లు తెలిపారు. మొదటి స్నాతకోత్సవంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి 13బంగారు పతకాలు రాగా నూజివీడుకు ఒకటి వచ్చిందన్నారు. బాసర ట్రిపుల్ ఐటీకి ఒక్క బంగారు పతకం కూడా రాలేదన్నారు. ఫీజులు చెల్లించని విద్యార్థులకు కాన్వకేషన్ ఇవ్వడంలేదన్నారు. ప్రభుత్వం నుంచే కాకుండా వారు చెల్లించాల్సిన ఫీజులను చెల్లించకపోవడంవల్లే కాన్వకేషన్ ఇవ్వడంలేదన్నారు. ఇడుపులపాయలో నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతనే హైదరాబాద్‌లో కాన్వకేషన్ సర్టిఫికెట్ పొందాలన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top