ఉచ్చు బిగుస్తోంది

ఉచ్చు  బిగుస్తోంది


‘కల్తీ’ వ్యవహారంలో మరింతమంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు,

వైద్యుల పాత్రపైనా ఆరా ‘విజిలెన్స్’పైనా విచారణ


 

 

విజయవాడ సిటీ : అజిత్‌సింగ్‌నగర్‌లోని ఇందిరానాయక్ నగర్ (పోలీసు కాలనీ)లో కర్మాగారం ఏర్పాటు చేసి కల్తీ నెయ్యి, ఇతర ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్న ఆవుల ఫణీంద్ర కుమార్ అలియాస్ ఫణిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రెండో నిందితుడైన ఫణి బావ అనిల్ కుమార్‌తో పాటు మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు. ఫణి వ్యాపార విస్తరణకు 150 మంది వరకు సహకరించినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. వారిలో 30 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్టు చెపుతున్నారు. వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసు విచారణలో ఫణి పలు ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు కొందరు రాజకీయ నేతల పేర్లు కూడా చెప్పినట్టు తెలిసింది.



 చూసీచూడనట్టు వదిలేశారు...

 కల్తీ నెయ్యి తయారీలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల పాత్ర కూడా ఉందని పోలీసు అధికారులు గుర్తించారు. పలుమార్లు పట్టుబడినప్పటికీ అతని వ్యాపారాన్ని నిలువరించేందుకు చర్యలు చేపట్టకపోగా చూసీచూడనట్టుగా వ్యవహరించారని చెపుతున్నారు. గతంలో గుట్కా వ్యాపారులకు సహకరించిన ఆరోపణలు కూడా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లపై ఉన్నాయి. అప్పట్లోనే క్రిమినల్ కేసుల నమోదుకు పోలీసు కమిషనర్ ఆదేశించారు. అయితే ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల సంఘం రంగంలోకి దిగి మరోసారి ఇలాంటి తప్పులు జరగవంటూ పోలీసు కమిషనర్ సవాంగ్‌ను కోరడంతో వదిలేశారు. తిరిగి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడే కల్తీ నెయ్యి, ఇతర ఆహార ఉత్పత్తుల వ్యవహారంలో వీరి పాత్ర వెలుగు చూడటంతో వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించినట్లు సమాచారం.

 

ప్రాంతీయ ఫోరెన్సిక్ లేబరేటరీకి నమూనాలు


 గతంలో పలుమార్లు ఫణీంద్ర పట్టుబడినా కల్తీ లేదంటూ వైద్యులు ధృవీకరించారు. ఇటీవల మరోసారి పట్టుబడిన ఫణీంద్ర కూడా తాను కల్తీ చేయట్లేదనడానికి ఆరోగ్యశాఖ లేబరేటరీ ఇచ్చిన సర్టిఫికెట్ నిదర్శనమని చెప్పాడు. పోలీసు విచారణలో మాత్రం తాను కల్తీ వాస్తవమేనని అంగీకరించినట్టు తెలిసింది. దీంతో గతంలో మాదిరి ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు కాకుండా పోలీసు శాఖ ఆధీనంలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ లేబరేటరీకి నెయ్యి, ఇతర నమూనాలు పంపారు. ఆ నివేదిక ఆధారంగా గతంలో సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులు, ఇతరులపై చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు.

 

 విజిలెన్స్‌నూ వదలొద్దు

 కల్తీ నెయ్యి వ్యాపారంలో చూసీచూడనట్టుగా వ్యవహరించిన విజిలెన్స్ అధికారులను కూడా వదలొద్దంటూ దిగువ స్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి. అతని వ్యాపారంపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా మొక్కుబడి దాడులు నిర్వహించారనేది వారిపై అభియోగం. పోలీసు విచారణలో నిందితుడు ఫణీంద్ర ఈ విషయం స్పష్టం చేసినట్టు తెలిసింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top