మారిషస్ కోర్టులో గంగిరెడ్డిపై విచారణ

కొల్లం గంగిరెడ్డి - Sakshi


అనంతపురం: ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అడిగినట్లు ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. ఏప్రిల్ 7న మారిషస్ కోర్టులో గంగిరెడ్డిపై విచారణ జరుగనున్నట్లు ఆయన చెప్పారు. చాలా మంది నిందితులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పకడ్బంధీగా కేసులు విచారణ కోసమే మానిటరింగ్ సెట్ ఉపయోగపడుతుందని డీజీపీ రాముడు చెప్పారు.  



ఇదిలా ఉండగా, ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డిని ఇంటర్‌పోల్‌ అధికారులు మారిషస్లో గత ఫిబ్రవరిలో అరెస్ట్‌ చేశారు. చాలా కాలంగా ఈ ఎర్రచందనం స్మగ్లర్‌ని అరెస్ట్‌ చేసేందుకు ఏపీ  పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అతను గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడు. విదేశాల్లో వున్న గంగిరెడ్డిని పట్టుకునేందుకు సీఐడీ అధికారులు, ఇంటర్‌పోల్‌ సహాయం కోరారు. చివరకు అతనిని మారిషస్‌లో ఇంటర్‌పోల్‌ అధికారులు అరెస్ట్ చేశారు.   గంగిరెడ్డి బెయిల్‌ కోసం మారిషస్‌ కోర్టులో పిటిషన్‌ వేశాడు. దానిని కోర్టు కొట్టివేసింది. అయితే న్యాయస్థానం విధించిన షరతులన్నీ పాటిస్తానని, దేశం విడిచి ఎక్కడికి వెళ్ళనని, భారత దేశానికి తనను అప్పగించవద్దని గంగిరెడ్డి మరోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు.



ఈ నేపధ్యంలో స్మగ్లర్‌ గంగిరెడ్డి పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరుతూ సీఐడీ అధికారులు సికింద్రాబాద్‌ రీజనల్‌ పాస్‌పోర్టు కార్యాలయానికి లేఖ రాశారు. గంగిరెడ్డిని మారిషస్‌ పోలీసులు అరెస్టు చేశారని, ఆయనపై అనేక ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులు ఉన్నాయని ఏపీ సీఐడీ అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో పాస్‌పోర్టు అధికారులు గంగిరెడ్డి పాస్‌పోర్టును రద్దు చేశారు.



ఇదిలా ఉండగా,  మారిషస్‌ నుంచి గంగిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి ఏపీ సిఐడీ విభాగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక బృందం మారిషస్ కూడా వెళ్లింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top