ప్రయాణ టెన్‌షన్ !


ప్రత్తిపాడు : పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లో మాత్రమే వసతులపై శ్రద్ధ చూపిన అధికారులు విద్యార్థుల రవాణా సౌకర్యంపై దృష్టి సారించలేకపోతున్నారు. ఫలితంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో టెన్త్ విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఒక పక్క విద్యార్థులకు పరీక్షల టెన్షన్...మరో పక్క పరీక్ష కేంద్రానికి పిల్లలను ఎలా తీసుకు వెళ్లాలా అని తల్లిదండ్రులకు కంగారు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేవు. పై గ్రామాల నుంచి వచ్చే ఆటోలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.



దీంతో కొందరు తల్లిదండ్రులు వారివారి అత్యవసర పనులను సైతం పక్కనపెట్టి తమ తమ బైక్‌లపై పిల్లలను కేంద్రాల వద్దకు తీసుకెళుతున్నారు. ఏ అవకాశం లేని విద్యార్థులు కిక్కిరిసిన ఆటోల్లో ఓ మూలన కూర్చునో లేక  వేలాడబడుతూనో వ్యయ ప్రయాసలకోర్చి పరీక్ష కేంద్రాలకు రాకపోకలు సాగిస్తున్నారు. పరీక్షలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుండగా విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవలసి ఉన్న నేపథ్యంలో ఇక్కట్లు తప్పడం లేదు.

 

సమయానికి రాని ఆర్టీసీ బస్సులు...

అనేక గ్రామాల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ సర్వీసులు లేవు. దీంతో ప్రైవేట్ వాహనాలే దిక్కయ్యాయి. ప్రత్తిపాడు పరీక్ష కేంద్రంలో గొట్టిపాడు, ప్రత్తిపాడు, తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.  కోయవారిపాలెం నుంచి వచ్చే విద్యార్థులకు మినహా మిగిలిన వారికి తగిన సమయాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండదు. అదేవిధంగా చినకోండ్రుపాడు సెంటరులో యనమదల, చినకోండ్రుపాడు, పొత్తూరు  విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. ఈ రెండు గ్రామాల నుంచి కేంద్రానికి రావాలంటే కచ్చితంగా ఆటోలు, ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయించాల్సిన దుస్థితి.

 

ఆటోలలో ప్రయాణం ప్రమాదమే...

విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు పంపే హడావుడిలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆటోలను ఆశ్రయించక తప్పడం లేదు. ఆటో డ్రైవర్లు ఆటోలను పుష్పక విమానంలా ఉపయోగిస్తున్నారు. ప్రమాదకర స్థితిలో ఆటోలో 20 నుంచి 25 మంది వరకు ఎక్కిస్తున్నారు. పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top