అర్హులందరికీ పరిహారం

అర్హులందరికీ పరిహారం - Sakshi

  • పారదర్శకంగా నష్టం అంచనాలు వేయండి

  •  సర్వే గడువు మరో మూడురోజులు పొడిగిస్తాం

  •  జాబితాలను గ్రామసభల్లో పెట్టండి

  •  అధికారులతో మంత్రులు గంటా, పత్తిపాటి

  • సాక్షి, విశాఖపట్నం: ‘గతంలో విపత్తులు సంభవించినప్పుడు..ఎన్నడూ ఇవ్వలేని స్థాయిలో రెట్టింపు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అనర్హులకు అందినా ఫర్వాలేదు కానీ, అర్హుల్లో ఏ ఒక్కరూ మిస్ కావడానికి వీల్లేదు’ అని రాష్ర్టమంత్రులు గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో రూరల్ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో నష్టం అంచనాలపై సమీక్షించారు.



    తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం. ముఖ్యమంత్రి నుంచి గ్రామ నౌకరు వరకు ప్రతీ ఒక్కరూ రేయింబవళ్లు శ్రమించాం. కేవలం ఆరు రోజుల్లోనే సాధారణ పరిస్థితుల్లోకి రాగలిగాం. ఇప్పుడు నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకోవడమే మనముందున్న ప్రధాన కర్తవ్య’మని మంత్రులు అన్నారు. గ్రామాల్లో నష్టం అంచనాలను పారదర్శకంగా చేపట్టండి. తుది జాబితాలను గ్రామసభల్లోనే కాదు.. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించండి.. అభ్యంతరాలుంటే స్వీకరించి అర్హుల్లో ఏ ఒక్కరూ జాబితాలో మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోండని సూచించారు.



    ప్రతీ ఒక్కర్ని ఆదుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నష్టం అంచనాల కోసం క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న సర్వే గడువు మరో మూడురోజులు పెంచే విషయమై  కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికితీసుకెళ్లి అనుమతి తీసుకుంటామన్నారు. పలువురు మండల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ విశాఖ నగరంలో అందుతున్న వేగంగా గ్రామస్థాయిలో నిత్యావసరాలు,కూరగాయల పంపిణీ జరగడం లేదన్నారు.



    విశాఖలో మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో కూడా 25 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని కోరారు. విశాఖలో తొమ్మిది సరుకులిస్తుంటే గ్రామాల్లో ఐదు సరుకులే ఇస్తున్నారని దీని వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు. వరిపొలం పచ్చగా ఉన్నా తుఫాన్ ప్రభావానికి గురైనట్టుగానే పరిగణనలోకి తీసుకోవాలని,కొబ్బరి, జీడిమామిడి, మామిడి, సపోటా వంటి హార్టికల్చర్ పంటలకు కోళ్లఫారాలకు, జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో ఉదారంగా స్పందించాలన్నారు.



    సమావేశంలో జెడ్పీ చైర్‌పర్శన్ లాలం భవానీ, ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాసరావు, జిల్లాసహకార శాఖాధికారి ప్రవీణ, ఆర్డీవో వెంకట మురళి, భీమిలి మున్సిపల్ మాజీ చైర్‌పర్శన్ గాడు చిన్న కుమారి లక్ష్మి పాల్గొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top