బదిలీల కసరత్తు


  •     జిల్లాలో 26 వేల మంది  స్థానచలనానికి రంగం సిద్ధం

  •      వైద్య, ఉన్నత విద్య, ఇంటర్ బోర్డు  ఉద్యోగులకు మినహాయింపు

  •      టీచర్లకు కౌన్సెలింగ్ పద్ధతిలోనే ... సెప్టెంబర్ 30లోగా పూర్తిచేయాలి

  •      రాష్ర్ట ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి అన్ని శాఖలకు మార్గదర్శకాలు

  • చిత్తూరు (టౌన్): ప్రభుత్వోద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు,అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. కాలపరిమితితో సంబంధం లేకుండా జిల్లా అధికారులను జీరో సర్వీసుతో బదిలీ చేయచ్చని ప్రభుత్వం నిర్దేశించింది. ఒకేచోట మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న మినిస్టీరియల్ స్టాఫ్‌కు మాత్రం బదిలీ తప్పదని పేర్కొంది. జిల్లాలో ఇంచుమించు 26 వేల మంది ఉద్యోగులు బదిలీకానున్నారు.



    వైద్య, ఆరోగ్యశాఖ,   ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖల ఉద్యోగులకు బదిలీల్లో మినహాయింపునిచ్చింది. ఉపాధ్యాయులకు మాత్రం కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేపట్టాలని నిర్దేశించింది. ఈ తతంగమంతా సెప్టెంబర్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ఆర్థికశాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ అజేయకల్లం మంగళవారం జారీ చేశారు. దాంతో జిల్లాలోని అధికారులు, ఉద్యోగుల్లో గుబులు పట్టుకుంది.  

     

    జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో 745 మంది



    జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో మొత్తం 745 మంది అధికారులు, ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమైంది. వీరిలో 65 మంది ఎంపీడీవోలు జీరో సర్వీసు నిబంధన కింద, 33 మంది సూపరింటెండెంట్లు, 647 మంది మినిస్టీరియల్ స్టాఫ్ మూడేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న నిబంధన కింద బదిలీకి అర్హులు. అయితే పంచాయతీరాజ్ పరిధిలో చేపట్టే బదిలీలన్నీ జెడ్పీ చైర్మన్ల పర్యవేక్షణలో జరగాల్సిందేనని ప్రభుత్వం మెలిక పెట్టింది.



    దాంతో జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఎంపీడీవో, ఈవోఆర్డీ తదితర అధికారుల మొదలు సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగుల బదిలీల వరకు జెడ్పీ చైర్మన్ కనుసన్నల్లోనే జరగాల్సి ఉన్నందున చైర్మన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు పలువురు క్యూకడుతున్నారు. బదిలీలపై నిషేధం సడలించక ముందు నుంచే జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అధికార పార్టీ నాయకులు తమ తమ ప్రాంతాల్లో బదిలీ చేయాల్సిన వారి జాబితాను చేతపట్టుకుని చైర్మన్ చుట్టూ తిరుగుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న ఎంపీడీవోలను నియమించుకునే పనిలో నిమగ్నమయ్యారు.  

     

    రెవెన్యూ శాఖలో అత్యధికం

     

    బదిలీల్లో రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 40 వేల మంది వరకు మినిస్టీరియల్ స్టాఫ్ పనిచేస్తుండగా వీరుకాకుండా ఇతర క్యాడర్‌లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఇంచుమించు 5 వేల వరకు ఉన్నారు. అయితే వీరిలో రెవెన్యూకు చెందిన వారు దాదాపు 25 శాతానికి పైగా ఉన్నారు. వీరిలో సగం మందికి  స్థానచలనం తప్పదు. మండలాల్లో తహశీల్దార్లు కీలకం కావడంతో తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయంలో కొంతమంది అధికార పార్టీ నేతలు జిల్లా మంత్రిని కలిసి తమకు అనుకూలమైన తహశీల్దార్ల జాబితాను ఇప్పటికే అందజేసి ఉన్నారు.

     

    సత్తా చాటడం కోసం..

     

    దశాబ్దకాలం తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో తమ సత్తాను చాటుకోవడం కోసం ఆ పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. తమతమ ప్రాంతాల్లో పని చేస్తున్న అధికారులంతా గత పాలకవర్గాలకు అనుకూలంగా పని చేశారని, వారిని ఎలా బదిలీ చేయాలా అని ఎదురుచూస్తున్న నేతలకు బదిలీల కాలం కలిసొచ్చింది. దాంతో తమకు అనుకూలంగా పనిచేసే వారిని నియమించుకునేందుకు జాబితాను ఇప్పటికే తయారు చేసుకున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top