బదిలీల కలకలం

బదిలీల కలకలం


సాక్షి, కర్నూలు: బదిలీల భయం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ప్రభుత్వం, ప్రజల ఆశయాలకు అనుగుణంగా నడుచుకునే వారికి తగిన పోస్టింగ్.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని లూప్‌లైన్‌లోకి తరలించేందుకు.. పనితీరు, స్టేషన్లకు నిర్దేశించిన గ్రేడ్‌ల ఆధారంగా బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పరిణామం గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల అండతో చెలరేగిన పోలీసు అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్‌ఐ నుంచి సీఐ స్థాయి అధికారుల పనితీరు ఆధారంగా బదిలీలపై కసరత్తు పూర్తి చేసి తుది జాబితా ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నట్లు తెలిసింది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ

 పూర్తి కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఎవరి జాతకం ఎలా ఉంటుందోనని పోలీసు వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. జిల్లాలో 55 మంది సీఐలు, 170 మంది ఎస్‌ఐలు ఉండగా.. సగం మందికి పైగా బదిలీల జాబితాలో ఉంటారని ఓ పోలీసు ఉన్నతాధికారి సూచనప్రాయంగా తెలిపారు. 30 మందికి పైగా సీఐలు.. 90 మందికి పైగా ఎస్‌ఐలకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది. గత పదేళ్లలో ప్రతి ఒక్క అధికారి నేపథ్యం.. పనితీరు.. ప్రజలతో సంబంధాలు.. స్టేషన్ సిబ్బంది పట్ల వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకుని ఎ, బి, సి, డి గ్రేడ్‌లుగా విభజించనున్నారు. ఫిర్యాదులను కూడా ప్రామాణికంగా తీసుకుని బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో విధుల్లో అంకతభావం ప్రదర్శించే వారికి గుర్తింపునివ్వాలనే ఉద్దేశంతో మంచి ఫోకల్ స్టేషన్లు ఇవ్వడానికి వీలుగా జిల్లా పరిధిలోని స్టేషన్లకు కూడా గ్రేడ్‌లు కేటాయించారు. రాజకీయ ప్రమేయం ఎలా ఉంటుందో.. లిటిగేషన్ రేషియో(ప్రజల మనస్తత్వం)ను ఆధారంగా చేసుకోనున్నారు. స్టేషన్ల వారీగా నమోదైన కేసుల సంఖ్య.. వాటి స్థాయి.. ఏ రకం కేసులు ఎక్కువగా వస్తున్నాయి.. పరిష్కారం ఏ స్థాయిలో ఉందో అంచనా వేశారు. ప్రభుత్వం మారినా కొన్ని సబ్ డివిజన్లలో పలువురు అధికారులు ఇంకా మాజీ ప్రజాప్రతినిధులు చెప్పినట్లు వ్యవహరిస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిని గుర్తించి తక్షణం రేంజ్ పరిధిలో ఎక్కడికైనా బదిలీలు చేపట్టవచ్చనే చర్చ ఉంది. ఏదేమైనా ప్రజాప్రతినిధుల సిఫారసుకు తావు లేకుండా నిజాయితీ అధికారులను అందలం ఎక్కించాలని.. వారి పనితీరుతో ప్రభుత్వానికి రానున్న రోజుల్లో మరింత మంచి పేరు తీసుకురావాలని భావిస్తున్న ఉన్నతాధికారులు ఆశయం ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాలి.







 



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top