బదిలీలు అడ్డం తిరిగాయి!


విజయవాడ : ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ ‘తెలుగు తమ్ముళ్లు’ వాలిపోతున్నారు. ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు అనుకూలమైన వారిని అందలం ఎక్కిస్తున్నారు. ఇదే తరహాలో జీరో సర్వీస్ ట్రాన్స్‌ఫర్ జీవోను అడ్డం పెట్టుకుని జిల్లాలో సబ్-రిజిస్ట్రార్ల బదిలీల విషయంలో జోరుగా పైరవీలు చేశారు. అక్రమ ఆదాయం దండిగా వచ్చే సీట్లలో నచ్చిన వారిని కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం పెద్దమొత్తంలో వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అధికార పార్టీకే చెందిన కొందరు నాయకులు ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో కథ అడ్డం తిరిగినట్లు సమాచారం.



 మూకుమ్మడిగా బదిలీలు..

 జిల్లాలోని సబ్-రిజిస్ట్రార్లను మూకుమ్మడిగా బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు మంగళవారం కసరత్తు పూర్తిచేశారు. బదిలీల ఉత్తర్వులను రాత్రికి విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. బదిలీల విషయం బయటకు పొక్కడంతో కొందరు సబ్-రిజిస్ట్రార్లు తమకు అన్యాయం జరిగిందని లబోదిబోమంటున్నారు. అసోసియేషన్ నాయకులు, వికలాంగులు, భార్యాభర్తలు మినహా దాదాపు జిల్లాలో అందరు సబ్ రిజిస్ట్రార్లనూ బదిలీ చేస్తూ ఉత్తర్వులు సిద్ధం చేశారు.



 గతంలో ఒకే చోట రెండేళ్ల సర్వీసు పూర్తయితేనే బదిలీ చేసేవారు. కానీ, ప్రస్తుతం జీరో సర్వీసు నిబంధన పేరుతో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తమకు కావలసిన వారిని అందలం ఎక్కించేందుకు ఈ జీవో విడుదల చేశారని, ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారని ప్రభుత్వంపై పలువురు సబ్ రిజిస్ట్రార్లు మండిపడుతున్నారు.



 మిగిలింది ముగ్గురే..!

 జిల్లాలో సబ్-రిజిస్ట్రార్ల అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రామారావు(పటమట), బాలాజీసింగ్(గాంధీనగర్ జాయింట్-2), ఆనందరావు(గుణదల జాయింట్-1) మినహా అందరినీ బదిలీ చేసినట్లు సమాచారం. ఈ ముగ్గురు మినహా జిల్లాలోని 30 మంది సబ్-రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు సిద్ధమైనట్లు తెలిసింది. గాంధీనగర్-1, గుణదల-2 సబ్ రిజిస్ట్రార్లుగా ఏలూరు, గన్నవరం నుంచి యోగేంద్రనాథ్, కృష్ణప్రసాద్‌లు వస్తారని ప్రచారం జరిగింది.



 గన్నవరానికి గాంధీనగర్ జాయింట్-1 సబ్-రిజిస్ట్రార్ సాయికృష్ణారెడ్డిని, గుణదలలో పని చేస్తున్న ఆర్‌కే నరసింహారావును కంకిపాడుకు బదిలీ చేయాలని నిర్ణయించారు. కంకిపాడులో పని చేస్తున్న రాఘవరావును అవనిగడ్డకు, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సీతారామంజనేయులును పామర్రుకు పంపాలని ఏర్పాట్లు చేశారు. అంగబలం, అర్థబలం ఉన్న కొందరు ఉన్నతాధికారులకు ముడుపులు ముట్టజెప్పి తమకు కావలసిన పోస్టింగ్‌లు పొందారని ఆరోపణలు వస్తున్నాయి. నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, నూజివీడు తదితర పోస్టింగ్‌లు కూడా పలుకుబడి కలిగిన వారికే దక్కాయనే ఆరోపణలు వస్తున్నాయి.



 ట్రిబ్యునల్ వెళ్లేందుకు సిద్ధం

 ఈ బదిలీలకు వ్యతిరేకంగా కొందరు సబ్-రిజిస్ట్రార్లు ట్రిబ్యునల్‌కు వె ళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గతంలో కౌన్సెలింగ్ నిర్వహించి 20 శాతం మందిని మాత్రమే బదిలీ చేసేవారని, ఈ ఏడాది అటువంటిదేమీ లేకుండా మూకుమ్మడిగా బదిలీలు చేయటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top