బదిలీల పైరవీలు


సిఫార్సులేఖలకు యమగిరాకీ

ఎమ్మెల్యేలు..మంత్రుల చుట్టూ చక్కర్లు

 


 సాక్షి, విశాఖపట్నం : బదిలీల పైరవీలు మొదలయ్యాయి. జాబితాలు సిద్ధం కావడంతో బదిలీ తప్పదనుకునేవారంతా తాము కోరుకునే ప్రాంతాల కో సం పైరవీలు మొదలు పెట్టారు. ఇన్‌చార్జి మంత్రికి తుది నిర్ణయం కట్టబెట్టడంతో జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బదిలీల్లో ఎక్కడా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మౌఖికంగా అధికారులకు ఆదేశాలతో వీరిచ్చే సిఫారసు లేఖలకు డిమాండ్ ఏర్పడింది. కొంతమంది ఇదే అదనుగా పోస్టులను బట్టీ భారీగా వసూళ్లకు సైతం తెగబడుతున్నారన్న వాదన వ్యక్తమవుతోంది.



జిల్లాలో బదిలీలకు రంగం సిద్ధమైంది. సీనియార్టీ జాబితాలు కొలిక్కివచ్చాయి. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, రవాణా, విద్య, వైద్యఆరోగ్యశాఖల్లో బదిలీల అలజడి ఎక్కువగా కనిపిస్తోంది. విద్య, వైద్య ఆరోగ్యశాఖల్లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా 20  శాతం మించకుండా బదిలీలు చేపట్టాలని తాజా మార్గదర్శకాలు జారీ  తో ఈ రెండుశాఖలు మినహా మిగిలిన శాఖల్లో మాత్రం గుబులు రేగుతుంది. నాన్‌గెజిటెడ్ పోస్టులకు కౌన్సెలింగ్ ద్వారా, గెజిటెడ్ స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్, ఇన్‌చార్జి మంత్రి, జిల్లా మంత్రులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో బదిలీలు చేపడతారు.



పైకి పారదర్శకమంటూనే స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిల మాట మీద కానివ్వండంటూ ఉన్నతస్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల సిఫారసు లేఖలకు డిమాండ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది పైరవీకారులు భారీగా వసూళ్లకు తెరలేపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. వారున్న చోట టీడీపీ ఇన్‌చార్జి లేఖలకు లేదా జిల్లా మంత్రుల లేఖలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరిచ్చే లేఖలను మంత్రులు జిల్లా అధికారులకు పంపిస్తున్నారు.



డివిజన్, జిల్లా స్థాయి పోస్టులకు జిల్లా మంత్రులే నేరుగా సిఫారసు లేఖలు ఇస్తున్నారు. బదిలీలకుగురయ్యేవారు ఈ లేఖల కోసం అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నాలుగు కాసులొచ్చే సీటు ఎవరైనా ఎగరేసుకు పోతారేమోనన్న ఆరాటం..ఆతృత ఉద్యోగుల్లో పెరిగింది. లేఖల కోసం పైరవీలుసాగిస్తున్నారు.ఈ లేఖలతో ఉన్నతాధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారు తప్పనిసరిగా బదిలీలకు గురి కానుండడంతో వారిలో టెన్షన్ మొదలైంది.



మరికొంతమందైతే.. తాము కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న సీటు పొందేందుకు పదోన్నతులను కూడా వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు  రెవెన్యూ, జెడ్పీ, వైద్య ఆరోగ్యశాఖ, మైన్స్, పంచాయతీరాజ్, ఆర్ అండ్‌బీ, ఇంజినీరింగ్ తదితర శాఖల్లోని కీలకపోస్టులకు ఎక్కడా లేని డిమాండ్ నెలకొంది. కోరుకున్న పోస్టు కోసం జిల్లా మంత్రులతోనే కాదు..ఇతర మంత్రులు, పొరుగు జిల్లాలల ప్రజాప్రతినిధులతో కూడా జిల్లా ఇన్‌చార్జి మంత్రిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.



కానీ జిల్లా కలెక్టర్ యువరాజ్ మాత్రం బదిలీలు సిఫారసులకు తావు లేనిరీతిలో  పూర్తి పారదర్శకంగా జరుగుతాయని చెబుతున్నారు. జన్మభూమి మావూరు..నవనిర్మాణ దీక్ష..ఆర్థిక పరిపుష్టివంటి కార్యక్రమాల వల్ల బదిలీల గడువు పెంచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఏది ఏమైనా సిఫార్సు లేఖల కోసం మాత్రం ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top