ఇక బదిలీల జాతర


► కోరుకున్న పోస్టింగ్‌లు రిజర్వ్‌ చేసుకుంటున్న అధికారులు

► అధికార పార్టీ నేతల సిఫారసుల కోసం ప్రదక్షిణలు

► మే నెలాఖరులో బదిలీలు జరగొచ్చని అంచనా


సాక్షి ప్రతినిధి – నెల్లూరు: జిల్లాలో బదిలీల జాతర ప్రారంభం కాబోతోంది. మే నెలాఖరులోపు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు జరపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ స్థాయిలో ఈ ఫైలు కదలిక తెలుసుకున్న అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు కోరుకున్న చోటికి బదిలీ కోసం అధికార పార్టీ నేతల చుట్టూ తిరగడం ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాదిలోనే జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మండల, గ్రామ స్థాయిలో తమకు అనుకూలంగా పనిచేసే అధికారులు, సిబ్బందిని నియమించుకోవడానికి ప్రభుత్వం యోచిస్తోంది.


దీంతో పాటు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు కూడా ఇక రెండేళ్లే గడువు ఉండటంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అధికార పార్టీ పావులు కదుపుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల అభీష్టం మేరకు బదిలీలు జరగబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం ప్రారంభమైంది. దీంతో పోలీసు, ఎంపీడీవో, తహసీల్దార్, హౌసింగ్, విద్యుత్, నీటి పారుదల సహా కీలకమైన ఇతర శాఖల అధికారులతో పాటు, ఉద్యోగులు సైతం మంచి పోస్టింగ్‌ల కోసం పైరవీలు ప్రారంభించారు.


అధికార పార్టీ నేతల అనుగ్రహం పొంది వారు అడిగినంత సమర్పించుకుని సీటు రిజర్వు చేసుకునే పనిలో పడ్డారు. ఒకే చోట రెండేళ్ల సర్వీసు పూర్తి కాకపోయినా కోరుకున్న చోటికి బదిలీ చేయిస్తామని కొందరు నాయకులు అప్పుడే బేరాలు మొదలు పెట్టారు.


హైవే స్టేషన్లకు డిమాండ్‌

తడ నుంచి కావలి దాకా ఉన్న హైవే పోలీసు స్టేషన్లతో పాటు గూడూరు, నెల్లూరు, కావలి పట్టణాల్లోని పోలీసు స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐల పోస్టులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఎస్‌ఐ పోస్టుకు 2 నుంచి 3 లక్షలు, సీఐ పోస్టుకు రూ.5 నుంచి రూ.10 లక్షల దాకా ఖర్చు పెట్టి పోస్టింగ్‌లు సంపాదించడానికి కొందరు సిద్ధమయ్యారు. బదిలీలు ప్రారంభమైతే ఫలానా స్టేషన్‌కు ఎవరినీ వేయించుకోవద్దని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలను ముందుగానే కలుస్తున్నారు. రాష్ట్ర స్థాయి కేడర్‌ బదిలీలు  కూడా జరిగితే జిల్లా నుంచి బయటకు పోకుండా  ఉండటానికి డీఎస్‌పీ స్థాయి అధికారులు కూడా అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.


ఎంపీడీవోలు, తహసీల్దార్ల పోస్టింగ్‌లకు పైరవీలు

తమను బదిలీ చేయించుకుంటే ఎన్నికల్లో మీకు ఉపయోగపడతామని, మీరు చెప్పిన పనులు చేసి పెడతామని కొందరు ఎంపీడీవోలు, తహసీల్దార్లు అధికార పార్టీ నేతల చుట్టూ తిరగడం ప్రారంభించారు. జరగబోయే బదిలీలు పూర్తిగా రాజకీయ అవసరాల ప్రాతిపదికగానే ఉంటాయని.. ఎమ్మెల్యేలు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిల నుంచి సిఫారసు లేఖ తీసుకుంటే సరిపోతుందని వారు భావిస్తున్నారు. అధికార పార్టీ నేతల అభీష్టం మేరకే బదిలీలు ఉంటాయని.. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు వీరి లేఖల ఆధారంగానే బదిలీలు చేయాల్సి ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top