బదిలీల గేటు తెరిచారు

బదిలీల గేటు తెరిచారు - Sakshi


శ్రీకాకుళం పాతబ స్టాండ్:  అంక్షలు తొలగాయి. గేట్లు తెరుచుకున్నాయి. ఉద్యోగుల బదిలీలకు మార్గం సుగమమైంది. మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గత రెండేళ్లుగా బదిలీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏడాది మధ్యలో బదిలీలు అంటే పిల్లల చదువులు, ఇతర ఇబ్బందులు ఎదురవుతాయన్న అభిప్రాయాన్ని ఎన్జీవో సంఘ ప్రతినిధులు, కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.



సెప్టెంబర్ 30 వరకు సుమారు 40 రోజులపాటు సాగే  బదిలీల జాతరకు మార్గదర్శకాలు ఇంకా తెలియలేదు. వెబ్‌సైట్‌లో జీవో ఇంకా పెట్టకపోవడం వల్ల ఆ వివరాలపై స్పష్టత లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. కాగా ఈసారి బదిలీలు పూర్తిగా రాజకీయ ప్రమేయంతో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ఉత్తర్వులు జారీ కాకముందే  పలు శాఖల అధిపతులకు మంత్రులు, విప్, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల సిపారసులు ఆశాఖల ఆదిపతులకు చేరాయి. బదిలీ లపై నిషేధాన్ని సడలించనున్నారని నెల రోజు లుగా ప్రచారం జరుగుతుండటంతో అప్పటినుంచే బదిలీలు కోరుకుంటున్న ఉద్యోగులు నాయకులను ఆశ్రయించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇతర ఇంజనీరీంగ్ విభాగాలకు సంబంధించి వందల సంఖ్యలో సిఫారసు లేఖలు అందినట్లు తెలిసింది.



వీటి ఆధారంగా కొన్ని శాఖల్లో ఇప్పటికే బదిలీల జాబితాను కూడా తాత్కాలికంగా సిద్ధం చేసినట్లు సమాచారం. నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో ఒత్తిళ్లు, సిఫారసులు మరింత పెరగనున్నాయి. ఈ ప్రక్రియ అధికార పార్టీ నాయకులకు, కొందరు అధికారులకు కాసుల పంట పండించనుంది. శాఖలు, ఉద్యోగుల క్యాడర్ ఆధారంగా రేట్లు నిర్ణయించినట్లు తెలిసింది. నిర్ణీత రేటు చెల్లించేందుకు అంగీకరించి అడ్వాన్సుగా కొంత ముట్టజెప్పేవారికే సిఫారసు లేఖలు ఇస్తున్నారు.

 

జిల్లాలో పరిస్థితి

జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో 25 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలోనై ఉపాధ్యాయులే అధిక సంఖ్యలో ఉండగా వీరికి కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు జరుగుతాయి. రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, తదితర శాఖల్లో మాత్రం సిఫారసులదే రాజ్యం. ఒకేచోట ఐదేళ్లుగా పని చేస్తున్నవారిని విధిగా బదిలీ చేయాల్సి ఉండగా, కనీసం రెండుమూడేళ్లు ఒకేచోట పని చేస్తున్నవారు బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. కానీ జీవోలో మార్గదర్శకాలు ఎలా ఉన్నాయన్నదాని బట్టి ఎందరు బదిలీ అవుతారన్నది స్పష్టమవుతుంది.

 

మధ్యంతర బదిలీలతో కొంత ఇబ్బందే

-హనుమంతు సాయిరాం, జిల్లా అధ్యక్షుడు, ఎన్జీవో సంఘం


 ఏడాది  మధ్యలో బదిలీలు  చేయడం వల్ల ఉద్యోగుల పిల్లల చదువులకు ఇబ్బందిగా మారుతుంది. అయితే ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్తే. బదిలీలు అన్ని శాఖల్లోనూ పారదర్శకంగా జరగాలి. పాలకుల సిపారసుల కంటే నిబంధనలకు పెద్దపీట వేయాలని అధికారులను కోరు తున్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top