రాజంపేటలో విషాదం


రాజంపేట పట్టణంలో ఆదివారం విషాదం అలుముకుంది. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు సంఘటనల్లో నలుగురు మృతి చెందారు. ఈతకు వెళ్లి ఇద్దరు.. ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు.. అనుమానాస్పద స్థితిలో మరొకరు మృతి చెందడంతో నాలుగు కుటుంబాలు శోకంలో మునిగిపోయాయి. 

 

ఈతకు వెళ్లి..  

రాజంపేట: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి మృతి చెందిన సంఘటన ఆదివారం రాజంపేట పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ అశోక్‌కుమార్‌ కథనం మేరకు.. రాజంపేట మండలం ఎంజీపురం రహదారిలోని చక్రధర్‌ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు కుమారుడు అమర్‌నాథ్‌(22) తన స్నేహితులు ప్రతాప్, కార్తీక్, మహేష్‌లతో కలిసి పట్టణంలోని పీఎన్‌ఆర్‌ స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లారు.

 

స్విమ్మింగ్‌పూల్‌లో నలుగురు ఈత కొడుతున్న సమయంలో నీటిలో ఉన్న అమర్‌నాథ్‌ స్పృహ కోల్పోయాడు. వెంటనే తోటి స్నేహితులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అమర్‌నాథ్‌ మృతి చెందాడు. కాగా  నలుగురు కూడా మద్యం సేవించి స్విమ్మింగ్‌కు వచ్చారు. మద్యం మత్తులో ఈత కొట్టడంతోనే అమర్‌నాథ్‌ మృతి చెంది ఉండవచ్చని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా మృతునికి కొద్ది నెలల క్రితమే వివాహమైంది. దీంతో  మృతుని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

 

హత్యరాలలో మరో యువకుడు 

ప్రముఖ పుణ్యక్షేత్రమైన హత్యరాలలోని బహుదా నదిలో ఈతకు వెళ్లి తిరుపతికి చెందిన రాము (22) అనే యువకుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం జనసందోహం తక్కువగా ఉన్న సమయంలో పక్క దోవ నుంచి బహుదా నదిలో ఈతకు వెళ్లిన రాము తీరం అవతలికి వెళ్లి తిరిగి ఇవతలికి వచ్చేటప్పుడు నీటిలో మునిగిపోయాడు.  దీంతో రాము మృతదేహం కోసం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 6గంటల సమయంలో రాము మృతదేహం లభ్యమైంది. రాము తిరుపతిలోని ఓ హోటల్‌లో పని చేసుకుని జీవించేవాడని అతని స్నేహితులు తహశీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డికి వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

ద్విచక్రవాహనం ఢీకొని..  

ద్విచక్రవాహనం ఢీకొన్న సంఘటనలో మండలంలోని యల్లాగడ్డకు చెందిన తాళ్లపాక వెంకటయ్య (50) మృతి చెందాడు. ఆదివారం హత్యరాలకు వెళ్లి వస్తున్న క్రమంలో తాళ్లపాకలో ద్విచక్రవాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

అనుమానాస్పద స్థితిలో..   

 రాజంపేట పట్టణం అహమ్మద్‌నగర్‌కు చెందిన సగినాల మౌలా (38) అనే  గ్రానైట్‌ వ్యాపారి ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తీవ్ర గాయాలతో అతని ఇంటి సమీపంలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పట్టణ సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ రెడ్డప్ప సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top