ట్రాక్టర్ బోల్తా : ఇద్దరు మృతి


పాలకొండ రూరల్/సీతంపేట : సీతంపేట మండలం సరిహద్దుగూడ ప్రాంతంలో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పాలకొండ నుంచి ట్రాక్టర్‌తో ఇసుకను తీసుకువెళ్తుండగా సరిహద్దుగూడ గ్రామానికి సమీపించగానే ట్రాక్టర్ ఘాట్ రోడ్డు దిగుతుండగా అదుపు తప్పి చెట్టుకు ఢీకొని లోయలో పడింది. ఇసుక తొట్టెపై కూర్చున్న సవర తోటయ్య(25) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ బాపయ్య(32)ను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. తోటయ్యకు భార్య అలివేలు, ఒక కుమార్తె ఉన్నారు.  అంతకు ముందు తీవ్రంగా గాయపడ్డ బాపయ్య, సుగయ్యలను పాలకొండ ఏరియూ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు.  సుగయ్యను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.  

 

 పోస్ట్‌మార్టానికి నిరాకరణ

 చర్చి నిర్మాణానికి ఇసుక తీసుకువస్తుండగా మృతి చెందిన తోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఎస్‌ఐ శ్రీనివాసరావు, సర్పంచ్ సారుుకుమార్, చర్చి పాస్టర్ వసంత్‌కుమార్ వారికి నచ్చజెప్పి ఒప్పించారు.  

 

 కూలికని వెళ్లి...

 రోజూలాగే తోటయ్య, బాపయ్య కూలికని ట్రాక్టర్‌తో వెళ్లారు. సాయంత్రం వేళ ఇంటికి వస్తారని ఎదురు చూసిన వారి కుటుంబ సభ్యులకు వారి మృతి వార్త అందింది. తమ కుటుంబ పెద్దలు ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. ఇక తమ దిక్కెవరూ అంటూ రోదించారు. వారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించారుు.

 

 ఇప్పటికైనా  కళ్లు తెరవాలి..

  పాలకొండ డివిజన్ పరిధిలో నాగావళి, వంశధార నదీ తీరాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనటానికి ఈ ఘటన అద్దం పడుతోంది. కాసుల కక్కుర్తితో ఇసుక ట్రాక్టర్ల యాజమానులతో పాటు మరి కొంత మంది నాటు బళ్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇదే కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విలువైన కలపతో పాటు ఇతర ముడి సరకులు వక్రమార్గాన పక్కదారి పడుతున్నాయి. వీటన్నింటిని అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్, ఐటీడీఏ అధికారులు సైతం ఇటువంటి అక్రమార్కులపై ఉక్కు పాదం మోపకపోవటం అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలని పలువురు సూచిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top