'సీమ'ను వణికిస్తున్న విష జ్వరాలు


వైఎస్ఆర్ జిల్లా : రాయలసీమను విష జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల సమ్మె చేయడం, ఎన్నడూ లేనంతగా వర్షాభావంతో తాగునీరు కలుషితం కావడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా మలేరియా, డెంగీ జ్వరాలు వ్యాపిస్తున్నాయి.



రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మలేరియా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. డెంగీ లక్షణాలతో వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ లక్షణాలతో ఇప్పటికే పలువురు మృత్యువాత పడటంతో జ్వర పీడితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రక్త పరీక్షల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గగానే డెంగీ లక్షణాలుగా భావించి కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వేలూరు నగరాల్లోని ఆస్పత్రులకు పరుగు తీస్తున్నారు. వేలాది రూపాయలు ఆసుపత్రులకు సమర్పించుకుంటున్నారు.



విషజ్వరాలు మరింత పెరిగే ప్రమాదముందని వైద్యులు కూడా చెబుతున్నారు. రెండు వారాల పాటు సాగిన పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ప్రభావం కూడా ఇప్పుడు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోవడంతో దోమలు ప్రబలి రాయలసీమ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు విష జ్వరాల బారిన పడ్డారు. కార్మికులు సమ్మె విరమించి చెత్త తొలగించినా జ్వరాల తీవ్రత మాత్రం తగ్గలేదు.



వృద్ధి చెందుతున్న లార్వా



రాయలసీమలో జ్వరాలు అధికమవడానికి వర్షాలు కురవకపోవడం కూడా కారణమేనని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గతంలో ఎప్పుడూ లేనంత వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సీమ జిల్లాల్లో విపరీతమైన నీటి ఎద్దడి నెలకొంది. సుమారు 3,700 పైచిలుకు గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి నెలకొంది. దాంతో రక్షిత తాగునీరు కరువైంది. ప్రజలు చెరువులు, కుంటల్లోని చివరన మిగిలిన జలాలు, అడుగంటిన బోర్లనుంచి అప్పుడప్పుడూ వచ్చే నీటివల్లకూడా విషజ్వరాలు ప్రభలుతున్నాయి. ఉన్న నీటికి పొదుపుగా వాడే క్రమంలో ప్రజలు నీటిని ఇళ్లలో ఎక్కువ కాలం నిలువ చేసుకుంటున్నారు.



నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో నిల్వ చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చాలా చోట్ల వారం, పది రోజులకోమారు మంచి నీరు వదులుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. అందువల్లే ఆ నీటి లోంచి లార్వా వృద్ధి పెరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. తద్వారా దోమలు పెరిగి జనం జ్వరాల బారినపడుతున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. మురికి కాలువల్లో కంటే కూడా నిల్వ చేసుకున్న మంచి నీటిలోనే లార్వా అధికంగా వృద్ధి అవుతున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.



పెద్ద సంఖ్యలో కేసుల నమోదు



ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పెద్ద సంఖ్యలో మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వర్షాకాల సీజన్ ప్రారంభం కావడంతో డయేరియా, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం 'సీమ' జిల్లాల్లో 304 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఇంతకు నాలుగురెట్లు కేసులు ఉండవచ్చని అంచనా.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top