అసలేం జరుగుతోంది..!

అసలేం జరుగుతోంది..!


- టౌన్‌ప్లానింగ్ తీరుపై డీటీసీపీ సీరియస్

- ప్రయివేటు దందా చెలాయిస్తున్న బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు

- ఫిర్యాదులున్నా చర్యల్లేవు

విజయవాడ సెంట్రల్ :
టౌన్‌ప్లానింగ్ తీరుపై టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డెరైక్టర్ తిమ్మారెడ్డి గుర్రుగా ఉన్నారు. ముఖ్య అధికారితో పాటు కొందరు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల వ్యవహారంపై నేరుగా ఫిర్యాదులు అందినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇటీవల నగరానికి విచ్చేసిన తిమ్మారెడ్డి ఒక ప్రముఖ హోటల్లో ముఖ్య అధికారికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ‘కొందరు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు దొరికితే దొంగలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలేం జరుగుతోంది ఇక్కడ? నా వరకూ ఫిర్యాదు వస్తే బాగోదు’ అంటూ సీరియస్ అయినట్లు తెలిసింది.



ప్రయివేటు దందా

ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు సరెండరవగా, ఒకర్ని సస్పెండ్ చేశారంటేనే టౌన్‌ప్లానింగ్ పరిస్థితి బాగోలేదన్న విషయం అర్థమవుతోంది. ముఖ్య అధికారి పర్యవేక్షణ కొరవడటంతో కింది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు రూ.లక్షల మొత్తంలో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. బినామీ పేర్లతో కోట్లు విలువ చేసే ఆస్తులు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్ చైన్‌మెన్లను పక్కన పెట్టి డివిజన్లలో అక్రమ కట్టడాలు, మామూళ్ల వసూళ్ల కోసం ప్రయివేటు వ్యక్తులను ముగ్గురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు నియమించుకున్నారు.



వాళ్ల ద్వారానే మామూళ్ల మంత్రాగం నడుస్తోందనేది బహిరంగ రహస్యం. సాయంత్రమయ్యే సరికి టౌన్‌ప్లానింగ్‌లో వాలిపోయే బ్రోకర్లు గప్‌చుప్‌గా అక్రమ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టేస్తున్నారు. బిల్డింగ్ ప్లాన్ దగ్గర నుంచి మార్ట్‌గేజ్ వరకు అంతా వారి కనుసన్నల్లోనే జరిగిపోతోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చెప్పినా జరగని పనులను సైతం వీళ్లు చక్కబెట్టేస్తున్నారు. పదోన్నతిపై బదిలీ అయిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు ఊపందుకోవడం వెనుక భారీ డీల్స్ నడిచినట్లు తెలుస్తోంది.



రెచ్చిపోతున్నారు

కర్ర ఉన్న వాడిదే గొర్రె అన్న చందంగా టౌన్‌ప్లానింగ్‌లో పరిస్థితి తయారైంది.  చిట్టినగర్ ప్రాంతానికి చెందిన ఒక  పవర్ బ్రోకర్ ఇద్దరు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను బెదరేసి మరీ పనులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం విజిలెన్స్, ఏసీబీ పెద్దల పేర్లు ఉపయోగించినట్లు సమాచారం. మార్ట్‌గేజ్, ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ బాండ్స్ వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్‌లో అవినీతిపై విజిలెన్స్, ఏసీబీలకు ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు లేకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.



సి‘ఫార్సు’పై సీరియస్

టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఇటీవలే నలుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు ఇద్దరు టీపీఎస్‌లను పదోన్నతిపై వేర్వేరు ప్రాంతాలకు బదిలీలు చేశారు. బదిలీ అయిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల స్థానే కొత్తవారు వచ్చే వరకు రిలీవ్ చేయడం సాధ్యం కాదని కమిషనర్ జి.వీరపాండియన్ స్పష్టం చేశారు. టీపీవో (టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్)గా రంగప్రసాద్, రాంబాబు పదోన్నతి పొందారు. రాంబాబు రిలీవై నూజివీడు వెళ్లగా  రంగప్రసాద్ డెప్యూటేషన్‌పై ఇంకా ఉయ్యూరులోనే టీపీఎస్‌గా కొనసాగుతున్నారు. ఎమ్మిగనూరులో పోస్టింగ్ చేపట్టేందుకు నిరాకరిస్తున్న రంగప్రసాద్ పలువురి పెద్దలతో సి‘ఫార్సు’లు చేయించడంపై డీటీసీపీ తిమ్మారెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. టీపీఎస్‌లుగా ఇద్దరు కొత్తవారికి పోస్టింగ్‌లు ఇచ్చినప్పటికీ ఎందుకు రిలీవ్ చేయడం లేదని ముఖ్య అధికారిని డీటీసీపీ గట్టిగా నిలదీసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మొత్తం మీద టౌన్‌ప్లానింగ్ అక్రమాలు ముఖ్య అధికారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top