విస్తరణ దిశగా ‘పాస్‌పోర్ట్’

విస్తరణ దిశగా ‘పాస్‌పోర్ట్’ - Sakshi

  • కొత్తగా 12 కౌంటర్లు ఏర్పాటు

  •  రీజనల్ కార్యాలయంలో రెండు అంతస్తులు కేటాయింపు

  •  పదిహేను రోజుల్లో ప్రణాళిక సిద్ధం

  •  నవంబర్ 1న పాస్‌పోర్ట్ మేళా

  • సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పాస్‌పోర్ట్ కేంద్రం మరింత విస్తరించనుంది. మన రాష్ట్రంలోని 13జిల్లాలకు కేంద్ర బిందువుగా మారనుంది. ఇందుకు అనుగుణంగా ప్రాంతీయ కార్యాలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. అధికారులు 15 రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఈ విస్తరణ పూర్తయితే పాస్‌పోర్ట్ పొందడం అత్యంత సరళతరమయ్యే అవకాశం ఉంది. నగరంలోని పాస్‌పోర్ట్ కార్యాలయం సేవలు గడిచిన ఐదునెలల కాలంలో వేగాన్ని పుంజుకున్నాయి.



    గతంలో 42 పనిదినాల్లో వచ్చే పాస్‌పోర్ట్ ప్రస్తుతం 30 పనిదినాల్లోనే  అందుతోంది. ప్రతి శనివారం పాస్‌పోర్ట్ మేళాలు, క్యాంపులు నిర్వహిస్తూ రోజుకి దాదాపు 900 దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు. దానిలో భాగంగా వచ్చే నెల 1వ తేదీన విశాఖలో పాస్‌పోర్ట్ మేళాను నిర్వహించనున్నారు. ఆ మేళాలో   పాస్‌పోర్ట్ పొందాలనుకునే వారికి బుధవారంతో అపాయింటమెంట్ గడువు ముగిసింది. సాధారణంగా మేళా జరిపడానికి మూడు రోజుల ముందే అపాయింట్‌మెంట్స్ ముగిస్తుంటారు.



    ఇలా మేళాలలో పాస్‌పోర్ట్‌లు ఇవ్వడంతో పాటు ఆ సంఖ్యను  పెంచాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పాస్‌పోర్ట్ సేవాకేంద్రంలో 18 కౌంటర్లున్నాయి. వాటికి తోడు మరో 12 కౌంటర్లను కొత్తగా నెలకొల్పనున్నారు. అయితే పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఆ మేరకు అవకాశం లేకపోవడంతో రీజనల్ కార్యాలయం భవనంలోని రెండు అంతస్ధులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాధనలు పంపించారు. 15 రోజుల్లో పూర్తి స్థాయి అనుమతులు సాధించి పనులు ప్రారంభించనున్నారు.

     

    పాస్‌పోర్ట్ పొందడం ప్రజల హక్కు



    ఈ నెల 25,26 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో క్యాంపు నిరహించి పాస్‌పోర్ట్ మంజూరు చేశాం. భవిష్యత్‌లోనూ అనేక జిల్లాలో మేళాలు జరుపనున్నాం.  నగరంలోని పాస్‌పోర్ట్ కౌంటర్లను పెంచనున్నాం. ప్రస్తుతం 18 కౌంటర్ల ద్వారా రోజుకి 40 స్లాట్‌లు అందిస్తున్నాం. అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి సాంకేతికంగా ఇబ్బందులు ఉన్నాయి. దీంతో కౌంటర్లు పెంచాలని నిర్ణయించాం. తద్వారా స్లాట్‌లు పెరిగి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తక్కువ సమయంలో పని జరిగే వెసులుబాటు లభిస్తుంది.

     - ఎన్‌ఎల్‌పి చౌదరి, పాస్‌పోర్ట్ అధికారి, విశాఖపట్నం

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top