చిక్కోలు తీరం... పర్యాటక సోయగం...


జిల్లాలో సువిశాల సాగర తీరం ప్రకృతి వర ప్రసాదం

 పర్యాటకంగా పురోగమించాలంటే యంత్రాంగం కృషి అనివార్యం

 పపంచ దేశాలను తలదన్నేలా అభివృద్ధికి ఎంతో అవకాశం

 సౌకర్యాలు కల్పిస్తే ఇక ఆర్థికంగా నిలదొక్కుకోవడం సుసాధ్యం


 

 శ్రీకాకుళం క ల్చరల్ :జిల్లాలో సువిశాల సాగరతీరం ఉంది. ఏ రాష్ట్రానికీ దక్కని అరుదైన అవకాశం మనకు లభించింది. కానీ అదంతా అడవికాచిన వెన్నెలే అవుతుందనడంలో సందేహం లేదు. విదేశాల్లో చిన్నపాటి సాగరతీరాలను సైతం విశేషంగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకంగా పురోగమిస్తుంటే... మనకున్న అవకాశాలను సైతం మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ప్రపంచంలో ఎక్కువ దేశాలు బీచ్ పర్యాకం ద్వారానే ఆర్థిక ప్రగతి సాధిస్తున్నాయనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఏ దేశానికీ లేనన్ని సహజ వనరులు ఉన్న మన జిల్లా తీరప్రాంత అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పర్యాటకుల సందర్శన అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి.

 

 కొరియాను పోలిన తీరం

 మన తీర ప్రాంతం అంతా సౌత్ కొరియాను పోలి ఉంది. అక్కడి బీచ్ అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం వల్ల నిత్యం సందర్శకులతో అది కళకళలాడుతుంది. తద్వారా ఎంతో ఆదాయిన్ని సైతం సమకూర్చుకోగలుగుతోంది. మన జిల్లాలో సుమారు 180 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. అయితే దీని అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వేయడం లేదనే చెప్పాలి. 2012లో మన పర్యాటక ప్రాంతానికి ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన ప్రాంతంగా కూడా గుర్తింపు లభించింది. అయినా దానిని అందిపుచ్చుకోవడంలో వెనుకబడ్డామనే చెప్పాలి. వంపులు లేని తీరం ఈ జిల్లా ప్రత్యేకత. ప్రస్తుతం జిల్లాలోని కళింగపట్నం, బారువా,  భావనపాడు, శివసాగర్ బీచ్‌లకు సందర్శకుల తాకిడి ఉంటోంది. కొరియా తీరాన్ని మనవారు పరిశీలించి ఆ తరహాలో అభివృద్ధి చేయగలిగితే పర్యాటకంగా ప్రాచుర్యం సాధించవచ్చు.

 

 కానరాని సౌకర్యాలు

 మన జిల్లాలో గతంలో ఎప్పుడో ఒకసారి టూరిజం శాఖ బీచ్ ఫెస్టివల్‌ను కళింగ పట్నంలో నిర్వహించింది. తరువాత దానిపై ఎటువంటి శ్రద్ధ కనపరచలేదు. జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నా వాటి  అభివృద్ధి కోసం నిధులు వెచ్చించక పోవడంతో పర్యాటకుల సందర్శన తక్కువగానే ఉంటోంది. బారువా బీచ్‌లో ఇప్పటికి రూ.3.50 కోట్లు ఖర్చు చేసి రిసార్టు కం హోటల్, హెల్త్ స్పా, మీటింగ్ హాల్, బార్ ఏర్పాటు చేశారు. కళింగపట్నంలో రూ. 3.20కోట్లతో రిసార్టు, హోటల్, బీచ్ వ్యూపార్కు, పార్కింగ్ తదితర పనులు చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు తీరంలో ఎంతో ఆహ్లాద పరుస్తూ ఉన్న శివసాగర్ బీచ్, సంతబొమ్మాళి ప్రాంతంలో ఉన్న భావనపాడు బీచ్‌ల్లో ఇంకా సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.

 

 ఇలా చేస్తే బాగుంటుంది

 బీచ్ టూరిజం జిల్లాలో ఇంకా పురోగమించాలంటే మరెన్నో నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. విదేశీ సందర్శకులను ఆకర్షించేలా ఏసీ రిసార్టులు, బీచ్ పడక కుర్చీలు, టెంట్లు, బీచ్ ప్రాంతంలో సీ మోటార్‌బైక్, వాట ర్ స్కైయింగ్, తినుబండారాల స్టాల్స్, వాటర్ స్పోర్ట్స్ వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి కుటుంబాలతో వచ్చిన వారు ఎక్కువ రోజులు గడిపేలా ఆహారపానీయాలు అందుబాటులో ఉండే ఏర్పాటు చేయాలి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top