రాజధాని సాధన కోసం కదంతొక్కిన కర్నూలు వాసులు

రాజధాని సాధన కోసం కదంతొక్కిన కర్నూలు వాసులు


సాక్షి ప్రతినిధి, కర్నూలు: అడుగులన్నీ ఒక్కటయ్యాయి.. నినాదాలు మార్మోగాయి.. రాజధాని కోసం ఊరూవాడ ఏకమైంది. విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు.. ఇలా అన్ని రంగాల వారు కదం తొక్కారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. సోమవారం కర్నూలు నగరంలో నిర్వహించిన పొలికేకను విజయవంతం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో కర్నూలుకు న్యాయం జరుగుతుందని ఆశించిన జిల్లా వాసులకు నిరాశే ఎదురవుతోంది. రాజధాని ఏర్పాటుపై మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారు.



 దీంతో రాజధాని సాధన కోసం కర్నూలులో ఉద్యమం ఊపందుకుంది. ఈనెల ఒకటిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణమండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌంటేబుల్ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కోసం ఉద్యమించాలని కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆ రోజే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటవగా కన్వీనర్‌గా కట్టమంచి జనార్దన్‌రెడ్డిని ఎన్నుకున్నారు. అందుకు టీడీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీ నేతలు, విద్య, ఉద్యోగ, రైతు, వివిధ వర్గాలు, సంఘాలు మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా గతంలో విద్యా సంస్థల బంద్‌చేసి విజయవంతం చేశారు. అయితే టీడీపీ నేతల ఒత్తిడితో కొందరు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు.



 పొలికేక విజయవంతం..

 రాయలసీమ పొలికేక పేరుతో రాజధాని ఉద్యమం ఊపందుకుంది. కర్నూలులో సోమవారం వివిధ వర్గాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. దీనిని విజయవంతం చేసేందుకు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కట్టమంచి జనార్దన్ రెడ్డి, రవీంద్ర విద్యాసంస్థల యజమాని పుల్లయ్య, వివిధ విద్యా సంస్థలు, విద్యార్థులు కృషి చేశారు.



 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి, మణిగాంధీ, గౌరు చరితారెడ్డి,  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు రామయ్య, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో నిర్వహించిన పొలికేక ర్యాలీలో ‘కర్నూలును రాజధానిని చేయాలి’ అనే డిమాండ్‌తో ముందుకు సాగారు.



 రాయలసీమ జిల్లా వ్యాప్తంగా..

 రాజధాని ఉద్యమం ఒక్క కర్నూలుకే పరిమితం కాకుండా రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలతో పాటు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూడా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆగస్టు 15 తరువాత ఆయా జిల్లాల రాజకీయ పార్టీ నాయకులు, వివిధ వర్గాల వారితో సమావేశం ఏర్పాటు చేయాలని రాజధాని సాధన కమిటీ భావిస్తోంది.



 ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం రాయలసీమ జిల్లాలో ఎంత విజయవంతమైందో అదే స్థాయిలో ఈ ఉద్యమం కూడా నిర్వహించాలని జేఏసీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడిని కూడా కలిసి కర్నూలుకు జరిగిన అన్యాయం గురించి వివరించేందుకు సిద్ధమయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top