నేడు ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నా

నేడు ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నా - Sakshi


పాల్గొననున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

- భూ ఆక్రమణలపై గళం విప్పేందుకు బాధితులు సిద్ధం

ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి  




 సాక్షి, విశాఖపట్నం: అధికార పార్టీకి చెందిన కబ్జారాయుళ్ల కబంధహస్తాల్లో చిక్కుకున్న విశాఖ నగరాన్ని రక్షించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ గురువారం నిర్వహించే ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నాకు తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. టీడీపీ నేతల భూ కబ్జాల వల్ల రూ. కోట్ల విలువైన భూములను ఎలా కోల్పోయామో చెప్పుకునేందుకు ఇదే సరైన వేదికగా బాధితులంతా భావిస్తున్నారు. జీవీఎంసీ ఎదుట గాంధీ బొమ్మ వద్ద జరిగే ధర్నాలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. వైఎస్‌ జగన్‌ ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌ నుంచి విమానంలో బయల్దేరి 9.30 గంటలకు విశాఖ చేరుకుంటారు.



విశాఖ భూ కుంభకోణంపై సీబీఐతో విచారించాలనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నాలో ప్రసంగిస్తారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు విమానంలో హైదరాబాద్‌ తిరిగి వెళ్తారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రోగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు. విశాఖ మహాధర్నా ఏర్పాట్లను వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ తదితరులు బుధవారం పరిశీలించారు. ఆందోళనలో తాము కూడా పాలుపంచుకుంటామని ఇతర విపక్షాలు, ప్రజాసంఘాలు ప్రకటించాయి.



గద్దల్లా వాలుతున్న అధికార పార్టీ నేతలు

రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖలో కాస్తంత ఖాళీ జాగా కన్పిస్తే చాలు టీడీపీ నేతలు వాలిపోతున్నారు. గత మూడేళ్లలో లక్ష కోట్లకు పైగా విలువైన భూములను కైంకర్యం చేశారన్న ఆరోపణలున్నాయి.భూ రికార్డుల ట్యాంపరింగ్‌ కుంభకోణంలో అధికార పార్టీ పెద్దలహస్తం ఉన్నట్టు తేటతల్లమవుతోంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్‌తో,  జిల్లాకు చెందిన ఓ మంత్రి పాత్రపై సీబీఐ విచారణ జరపాలని ప్రజలు ముక్తకంఠంతో  డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోకుండా సిట్‌తో దర్యాప్తునకు ఆదేశించటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.



సీబీఐ విచారణ కోసం వైఎస్సార్‌ సీపీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి విపక్షాలన్నింటినీ ఏకతాటిìపైకి తెచ్చింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో పెందుర్తి మండలం ముదుపాక గ్రామంలో పర్యటించింది. ల్యాండ్‌ పూలింగ్‌ మాటున బలవంతంగా భూములు లాక్కోవడంతో రోడ్డున పడ్డ బాధితులకు అండగా నిలిచింది. ఈ భూకుంభకోణాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top