రక్షకులారా..వందనం

రక్షకులారా..వందనం - Sakshi


పోలీస్.. ఈ పేరు వింటేనే సంఘవిద్రోహశక్తులకు వణుకుపుడుతుంది. నేరగాళ్లకు భయమేస్తుంది. సామాన్య ప్రజలకు భరోసా లభిస్తుంది. తలపై మూడు సింహాల టోపీ.. ఒంటిమీద ఖాకీ దుస్తులు.. చేతిలో లాఠీ.. కాళ్లకు బూట్లు ధరించగానే త్యాగానికి వారు మారుపేరవుతారు. రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తూ అలుపెరుగని రక్షకులవుతారు. సమాజాన్ని, ప్రజలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. అలాంటి సమయంలో ఎంతోమంది పోలీసులు ప్రాణాలర్పించారు. నేడు 55వ పోలీసు అమరవీరుల దినం సందర్భంగా.. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు జోహార్లు.



* నేడు 55వ పోలీసు అమరవీరుల దినం

* ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు


ఒంగోలు క్రైం : పోలీస్ ఉద్యోగమంటే.. ఇంకేముందిలే అంతా హ్యాపీనేగా అనుకుంటారు. ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఏమైనా చేయొచ్చు, పవర్ చూపించొచ్చు, మంచి జీతం, కావాల్సినంత గీతం అని అందరూ భావిస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు ఎంతో త్యాగముంటుంది. రాత్రింబవళ్లు విధులుంటాయి. ఏ సమయంలో ఏం జరిగినా పరిగెత్తుకుంటూ వెళ్లి పనిచేయాలి. సమాజంలో జరిగే ప్రతి నేరానికీ వారే బాధ్యత వహించాలి. ఇంట్లో ఎప్పుడుంటారో వారికే తెలీదు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు అతి తక్కువ సమయం ఉంటుంది.



ఇక.. బంధువులు, స్నేహితులనైతే మర్చిపోవాల్సిందే. పోలీస్ ఉద్యోగం సాధించేందుకు ఎంతో కష్టపడాలి. బాధ్యతగా పనిచేస్తూ ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకునేందుకు అంతకన్నా కష్టపడాలి. విధి నిర్వహణలో నిత్యం సవాళ్లు ఎదుర్కోవాలి. ప్రాణ త్యాగానికి సైతం సిద్ధంగా ఉండాలి. అలాంటి పోలీసులకు జిల్లాలో కొదవలేదు. జిల్లాకు చెందిన ఎంతోమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలర్పించారు. అమరవీరులుగా జోహార్లు అందుకుంటున్నారు. మంగళవారం 55వ పోలీసు అమరవీరుల దినం సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది.

 

1959 అక్టోబర్ 21వ తేదీ భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన ఆక్సాయ్‌చిన్ వద్ద జరిగిన పోరాటంలో ఎంతోమంది సాయుధ పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలను గుర్తుచేసుకునేందుకు అప్పటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీ దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినం నిర్వహిస్తున్నారు. అనంతరం మావోయిస్టులతో జరిగిన పోరాటాలు, ఇతర సందర్భాల్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులనూ అమరవీరుల జాబితాలో చేర్చి ఏటా వారి సేవలను స్మరించుకుంటున్నారు.

 

జిల్లాకు చెందిన పోలీసు అమరవీరులు వీరే...

* 1995లో అప్పటి ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డిపై ఆయన కార్యాలయంలో మావోయిస్టులు దాడిచేశారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఎంపీ మృతిచెందా రు. ఆయన అంగరక్షకునిగా ఉన్న కానిస్టేబుల్ పీసీ రత్నం మావోయిస్టులతో తీవ్రంగా పోరాడి ప్రాణాలొదిలారు.

* 2002లో పుల్లలచెరువు పోలీసుస్టేషన్‌కు చెందిన ఏఎస్సై ప్రశాంతకుమార్ విధి నిర్వహణలో భాగంగా శతకోడు గ్రామం వెళ్లారు. అక్కడ మావోయిస్టులు దాడిచేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

* 2008 జూన్ 29న ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో విధులు నిర్వహిస్తూ బలిమెల దుర్ఘటనలో మావోయిస్టుల ఘాతుకానికి లేళ్ల శంకర్, మోటా ఆంజనేయులు మృతిచెందారు. వీరిద్దరూ మన జిల్లా వారే. వీరితో పాటు జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ బెటాలియన్లలో పనిచేస్తూ శత్రుదేశాల దాడిలో జిల్లాకు చెందిన అనేక మంది అమరులయ్యారు.

* 2009 సెప్టెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితోపాటు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ కర్నూలు జిల్లా పావురాలగుట్ట వద్ద జరిగిన ప్రమాదంలో సీఎంతో పాటు జిల్లాకు చెందిన ఆయన ప్రధాన భధ్రతా అధికారి అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ మరణించారు.

* 2010 మే 19న లైలా తుపాను సమయంలో నల్లవాగులో కొట్టుకుపోతున్న ఆర్టీసీ కండక్టర్ యానాదిరావును కాపాడే ప్రయత్నంలో అద్దంకికి చెందిన కానిస్టేబుల్ రఫీ ప్రాణాలు కోల్పోయారు.

 

నివాళులర్పించనున్న మంత్రి, కలెక్టర్, ఎస్పీ...

పోలీసు అమరవీరుల దినం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం 7.45 గంటల నుంచి నిర్వహించనున్న కార్యక్రమాల్లో మంత్రి శిద్దా రాఘవరావు, కలెక్టర్ విజయకుమార్, ఎస్పీ శ్రీకాంత్, తదితరులు పాల్గొననున్నారు. పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి జిల్లాకు చెందిన పోలీసు అమరవీరులకు స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. వారి కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. అనంతరం పోలీసు అమరవీరుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ మేరకు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top