నేడు రంజాన్‌ వేడుక


విజయనగరం టౌన్‌: రంజాన్‌ వేడుకకు మసీదులు ముస్తాబయ్యాయి. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు నెలవంక దర్శనంతో  ప్రత్యేక ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. హిందూపురం, చిత్తూరు, కోల్‌కతాలో నెలవంక దర్శనమిచ్చిందని,  సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు, దైవ సందేశం వినిపిస్తామని జమాతే ఇస్లామీ హింద్‌ సభ్యులు అబ్దుల్‌ సబూర్, మహ్మద్‌ హబీబ్‌లు  ఆదివారం రాత్రి తెలిపారు.



 పట్టణంలోని జామియా మసీదు, చోటీ, హుస్సేనీ, కంటోన్మెంట్‌ తదితర మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయన్నారు. వర్షం ఎక్కువైతే ఎవరికి వారు ఆయా మసీదుల్లో నమాజ్‌ చేస్తారని తెలిపారు. రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు నెలవంక దర్శనంతో పేదలకు దానాలు చేయడం ఆనవాయితీ. ప్రతి వ్యక్తి రెండున్నర కిలోలు చొప్పున నిరుపేదలకు బియ్యం, గోధుమలు అందజేస్తారు.  



ముస్తాబవుతున్న మసీదులు

పట్టణంలో పది వరకూ మసీదులున్నాయి. జామీయా మసీదు, చోటీ, న్యూమజిద్‌ కంటోన్మెంట్, పల్టన్, హుస్సేనీ, కన్యకపరమేశ్వరీ ఆలయం వద్ద ఉన్న మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఒకరికొకరు రంజాన్‌ శుభాకాంక్షలు చెబుతూనే సర్వమానవాళి శ్రేయస్సుకు దువా చేస్తారు. దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వమానవ సౌభ్రాత్వత్వం కోసం, దేశంలో ఉన్న అశాంతి నిర్మూలనకు, దేశాభివృద్ధికి, సోదర భావం, ఐక్యత పెంపొందించేందుకు ప్రార్థనలు చేస్తారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top