ఫైనల్‌.. కాస్కో !

ఫైనల్‌.. కాస్కో !


► నేడే ఐపీఎల్‌ ఫైనల్‌

► భారీగా బెట్టింగ్‌లు

► రెండు జిల్లాల్లో రూ.100 కోట్లు చేతులుమారే అవకాశం

► అధికార పార్టీ పెద్దలే సూత్రధారులు

► విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లిలో భారీగా ఏర్పాట్లు చేసిన బుకీలు

► పట్టించుకోని  పోలీసుయంత్రాంగం




సాక్షి, గుంటూరు: నలభై ఐదు రోజులుగా క్రికెట్‌ బుకీలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్‌–10 చివరి దశకు చేరింది. ముంబయి ఇండియన్స్‌–పుణే సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఆదివారం రాత్రి ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా రాజధాని జిల్లాల్లో భారీగా బెట్టింగ్‌లు నిర్వహించేందుకు బుకీలు రంగం సిద్ధం చేశారు. ఫైనల్‌ మ్యాచ్‌ కావడంతో రెండు జిల్లాల్లో కలిపి నాలుగు గంటల్లోనే రూ.100 కోట్ల వరకు చేతులు మారే అవకాశం ఉందని అంచనా.



బుకీలు అపార్టుమెంట్లను కేంద్రంగా చేసుకుని యువత, వ్యాపారులే లక్ష్యంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆన్‌లైన్‌ ద్వారా నడిపిస్తున్నారు. కొందరు బంతిబంతికీ బెట్టింగ్‌ నిర్వహిస్తూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. బుకీలు ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది.



పోలీసు నిఘా నామమాత్రమే..!

ఏప్రిల్‌ ఐదో తేదీన ఐపీఎల్‌–10 ప్రారంభమైంది. అప్పటి నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. సులభంగా డబ్బు వస్తుందనే ఆశతో మధ్య తరగతి ప్రజలు, కూలీలు సైతం పందేలు కాస్తున్నారు. పోలీసులు పెద్ద బుకీలను వదిలి కేవలం కొద్ది మొత్తంలో పందేలు కాస్తున్నవారిని మాత్రమే అరెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా, విజయవాడ కమిషనరేట్, గుంటూరు రూరల్, అర్బన్‌ జిల్లా పరిధిలో 50 వరకు బెట్టింగ్‌ కేసులు నమోదు చేశారు.



అయితే ఎక్కడా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోలేదు. బెట్టింగ్‌ బోర్డు నిర్వాహకులను అరెస్ట్‌ చేయలేదు. కొందరు పోలీసులే బుకీల నుంచి మామూళ్లు వసూలు చేసి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు బెట్టింగ్‌ల జోలికి వెళ్లడంలేదని తెలిసింది. మరోవైపు గుంటూరులో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు, క్విక్‌ రియాక్షన్‌ బృందాలు దాడులు నిర్వహించి పట్టాభిపురం, అరండల్‌పేట, గుంటూరు రూరల్‌ తదితర స్టేషన్ల పరిధిలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఎనిమిది బృందాలను అరెస్ట్‌ చేయడం ఇందుకు బలాన్నిస్తోంది.



విజయవాడలో వింత పరిస్థితి...

విజయవాడలో ఒకటి, రెండు స్టేషన్లు మినహా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మాత్రమే బెట్టింగ్‌ రాయుళ్లను అరెస్ట్‌ చేస్తున్నారు. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు పెద్ద ఎత్తున డబ్బులు అందడమే ఇందుకు కారణమని సమాచారం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కీలకమైన బెట్టింగ్‌లను వదిలి పోలీసులు ఇప్పుడు నిషేధిత గుట్కా విక్రేతలపై దాడుల పేరుతో హడావుడి చేస్తున్నారు. ఐపీఎల్‌ బెట్టింగ్‌ల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.



అధికార పార్టీ నేతల అండతోనే...

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల అండతోనే బుకీలు యథేచ్ఛగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. కొందరు నేతలు ఏకంగా బుకీలతో సంబంధాలు పెట్టుకుని బెట్టింగ్‌ల నిర్వహణకు సహకరిస్తున్నారు. విజయవాడ బావాజీపేటలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయం కేంద్రంగా టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా... పోలీసులు అటువైపు వెళ్లే సాహసం చేయడం లేదు. సత్తెనపల్లి, గుంటూరులో కూడా అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల ముఖ్య అనుచరులే బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.



సత్తెనపల్లిలో బెట్టింగ్‌ బోర్డు...

సత్తెనపల్లి, గుంటూరుల్లో ప్రధాన బెట్టింగ్‌ బోర్డు నిర్వాహకులు ఉన్నారు. వీరి నుంచి ప్రాంతాల వారీగా అనేక మంది స్థానికంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటారు. బెట్‌ ఫేర్‌తోపాటు పలు వెబ్‌సైట్లలో బంతిబంతికీ బెట్టింగ్‌ కాస్తుంటారు. ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రధానంగా ముంబయి హాట్‌ ఫేవరేట్‌ కావడంతో ఈ బెట్టింగ్‌ బోర్డు ఆ జట్టుపై     రూ.లక్షకు రూ.70 వేలు ఇస్తే చాలు.. పుణే గెలిస్తే   రూ.లక్షకు రూ.1.35 లక్షలు ఇస్తామని ఊరిస్తున్నట్లు సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top