ఆళ్లగడ్డ కంటతడి!


ఆళ్లగడ్డ టౌన్, న్యూస్‌లైన్:  ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి అకాల మృతితో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ అభిమాన నాయకురాలు ఇక లేరని ప్రజలు దుఃఖసాగరంలో మునిగారు. బుధవారం రాత్రి తమ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు.



ప్రతి క్షణం ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు  టీవీలకు అతుక్కుపోయారు. ప్రమాద సంఘటన స్థలాన్ని, గాయపడిన ఎమ్మెల్యేను ఆసుపత్రికి తరలించిన దృశ్యాలను టీవీల్లో చూస్తూ అభిమానులు కంటతడి పెట్టారు. ఆమె కోలుకోవాలని కులమతాలకు అతీతంగా ప్రజలు దేవుళ్లను ప్రార్థించారు.



గురువారం ఉదయం ఎమ్మెల్యేను హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించిన తర్వాత కోలుకుంటారని అందరూ భావించారు. అయితే ఆమె మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించినట్లు టీవీల్లో న్యూస్ రావడంతో తట్టుకోలేక పోయారు. మహిళలు, వృద్ధులు దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు.



తమ అభిమాన నాయకురాలు లేరని తెలుసుకుని ఆళ్లగడ్డలోని భూమా నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎమ్మెల్యే చూపిన ఆప్యాయతను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.



మారు మూల గ్రామాలకు చెందిన వ్యక్తి అయినా కనిపిస్తే పేరు పెట్టి ఆప్యాయంగా పలకరించేవారని, ఆమె కంటే కొంచెం వయస్సులో పెద్ద వారిని బాగున్నావా.. అన్నా.. అని ఎంతో మమకారంతో పిలిచేదని కొందరు చెప్పారు. ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతి వార్త తెలుసుకున్న ఆళ్లగడ్డ  పట్టణ వ్యాపారులు దుకాణాలు మూసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. దీంతో అన్ని వీధులు నిర్మానుష్యంగా మారాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top