అధికారులకు శ్రీముఖాలు


సాక్షి కథనాలకు స్పందన

 

ధాన్యం మిల్లుల్లో జరుగుతున్న అక్రమాల వ్యవహారం ఇప్పుడు అధికారుల మెడకు చుట్టుకుంది. తప్పుజరుగుతున్నా అడ్డుకోని అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు  క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఇందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నోటీసులు తయారయ్యాయి.

 

విజయనగరం కంటోన్మెంట్: ధాన్యం మిల్లుల్లో అక్రమాలు జరుగుతున్నా మిన్నకున్నారని, సక్రమంగా తనిఖీలు చేయలేదంటూ దాదాపు ఆరుగురు అధికారులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ‘ట్రిక్‌షీట్లు’, ‘పత్రాల మాటున పచ్చి మోసం’ శీర్షికలతో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనాలపై ప్రభుత్వం స్పందించింది. సంబంధిత వీఆర్వోలు, డిప్యూటీ తహశీల్దార్లు, వెలుగు సిబ్బందికి నోటీసులు జారీ చేస్తున్నామని జేసీ రామారావు తెలిపారు.



ఈ వ్యవహారంలో మొత్తం గన్నీ బ్యాగులెన్ని ఇచ్చాం. అవి ఎవరి వద్ద ఉన్నాయి? ట్రక్ షీట్లు ఎవరెవరి వద్ద ఉన్నాయి? అనుమతి పత్రాలెన్ని తీసుకున్నారు? అందులో సక్రమంగా ఉన్నవెన్ని? నకిలీవెన్ని అన్న దాదాపు  12 రకాల ప్రశ్నలకు మూడు రోజుల్లోగా  వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా  గంట్యాడలోని సాయి వరలక్ష్మి రైస్ మిల్లును బ్లాక్‌లిస్టులో పెట్టి,లెసైన్సును కూడా రద్దు చేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్  తెలిపారు. కేవలం గంట్యాడలోని రైస్‌మిల్లు పరిధిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సక్రమంగా మిల్లులను తనిఖీలు చేయని సిబ్బందిపైనా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

 

అసలు బాగోతాలు బయట పడతాయా..?

జిల్లాలోని రైస్‌మిల్లర్లు అధికారుల సహకారంతో అక్రమాలకు పాల్పడుతున్నారన్న విషయం తేటతెల్లం కానుందా..? అధికారులు నిత్యం తగు తనిఖీలు నిర్వహించకపోవడంతోనే మిల్లులు, కొనుగోలు కేంద్రాల్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమాలు జరిగిపోతున్నాయా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో పాటు ఆయన దీనిపై తీవ్రంగా స్పందించడంతోనే ఈ నోటీసుల వ్యవహారం తెరపైకి వచ్చింది. మిల్లులను సక్రమంగా పర్యవేక్షించి ఎక్కడా అక్రమాలు, అవినీతి జరగకుండా చూడాల్సిన అధికారులు కొందరు మిల్లర్ల వద్ద తలొగ్గారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  

 

మిల్లర్లకు రూ.25వేల చొప్పున జరిమానా  విధించారు. అయితే ఆ మిల్లర్లు మేమెందుకు చెల్లించాలని తిరిగి అధికారులనే ప్రశ్నించే స్థాయికి వచ్చారంటే అధికారుల పాత్ర ఎలా ఉందో..? స్పష్టంగా అర్థమవుతోంది. జిల్లాలో ఎప్పటినుంచో జరుగుతున్న ఈ తంతు ఇటీవల మిల్లర్ల మధ్య అభిప్రాయ భేదాలతో బయటకు వచ్చింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top