ప్రాణ భిక్షపెట్టండి

ప్రాణ భిక్షపెట్టండి - Sakshi

  • మావోయిస్టుల నుంచి రక్షణ కల్పించాలి

  • కలెక్టరేట్ ఎదుట గిరిజనుల ఆందోళన

  • పౌరహక్కుల నేత ఇంటివద్ద ధర్నా

  • మావోయిస్టుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ చింతపల్లి మండలంలోని ఐదుగ్రామాల గిరిజనులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వమే తమకు ప్రాణభిక్ష పెట్టాలని కలెక్టర్ యువరాజ్‌ను కలిసి వేడుకున్నారు. అంతకు ముందు గాజువాకలోని పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి ఇంటి వద్ద ధర్నా చేపట్టిమావోయిస్టు పార్టీ నాయకులతో మాట్లాడి తమను కాపాడాలని డిమాండ్ చేశారు.

     

    విశాఖపట్నం : ఇటీవల నక్సల్స్ చేతిలో హత్యకు గురైన గమ్మెలి సంజీవరావు కుటుంబసభ్యులతో పాటు చింతపల్లి మండలం వీరవరం, తూరుమామిడి, దిగవలసపల్లి, కోరుకొండ, జోహార్ గ్రామాలకు చెందిన గిరిజనులు ప్లకార్డులతో గాయత్రీ సేవా సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి బుధవారం యత్నించారు. అమరవీరుడు గమ్మెలి సంజీవరావుకు జోహార్లంటూ నినదించారు.



    తమ గురువైన సింహాచలంతో కలసి భక్తిమార్గాన్ని బోధిస్తున్న  సంజీవరావును మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ పేరుతో పొట్టన పెట్టుకోవడాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. సంజీవరావు సోదరుడు గమ్మెలి భాస్కరరావు మాట్లాడుతూ ఐదు గిరిజన గ్రామాలకు చెందిన మూడు వందల కుటుంబాలకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉందన్నారు.



    ఇప్పటికే 19 మందిని పొట్టన పెట్టుకున్న మావోయిస్టులు మరికొందరిని చంపుతామని హెచ్చరించడంతో వందలాది మంది భయంతో గ్రామాలను విడిచి వెళ్లిపోయారని వాపోయారు. మావోయిస్టులకు మద్దతు ఇవ్వలేద న్న నెపంతోనే తన సోదరుడు సంజీవరావును హతమార్చారని, నిజానికి తన సోదరునికి పోలీసులతో ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ మేరకు ఐదు గ్రామాల ప్రజలు కలెక్టర్‌ను కలిసి రక్షణ కల్పించాలంటూ వినతి పత్రం అందజేశారు.

     

    ప్రాణ రక్షణ కల్పించాలంటూ ధర్నా :  మావోయిస్టుల నుంచి ప్రాణ రక్షణ కల్పించాలంటూ ఐదు గ్రామాల గిరిజనులు గాజువాకలోని పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు తుంపాల శ్రీరామ్మూర్తి ఇంటి వద్ద ధర్నా నిర్వహించారు. బ్యానర్లు, ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. మావోయిస్టు పార్టీ నాయకులతో మాట్లాడి తమకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు.



    ఈమేరకు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఈ సంఘటనపై మావోయిస్టు పార్టీ నాయకులు సంయమనం పాటించాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సంఘటనపై పౌర హక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి త్వరలో ఏజెన్సీలో పర్యటించి వాస్తవాలను సేకరిస్తుందన్నారు. గిరిజనులతో సఖ్యతగా మెలగాలని, వారికి ఏ విధమైన ప్రాణహాని తలపెట్టవద్దని దళసభ్యులను కోరారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top