చంద్రబాబుకు నిరసన సెగలు

చంద్రబాబుకు నిరసన సెగలు - Sakshi

  • బస చేసిన హోటల్ వద్ద తెలుగు తమ్ముళ్ల ధర్నా

  •   కార్పొ‘రేట్’ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు

  •   టిక్కెట్ల విక్రయంపై వెల్లువెత్తిన ఆగ్రహం

  •  సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు తెలుగు తమ్ముళ్ల నుంచి నిరసన సెగలు కొనసాగుతున్నాయి. విజయవాడలో ఆయన బసచేసిన హోటల్ ఎదుట శనివారం పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. శుక్రవారం జిల్లాలో ప్రచారం ముగించుకుని హోటల్‌లో బస చేసిన బాబుకు ఉదయాన్నే నిరసన సెగలు ఎదురయ్యాయి.



    విజయవాడ తూర్పు నియోజకవర్గ సీనియర్ నేత ఎంవీఆర్ చౌదరి వర్గీయులు పెద్ద ఎత్తున హోటల్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడ పొద్దుటూరు ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి అనుచరులు ధర్నా చేస్తూ ఉండటంతో ఆ ప్రాంతమంతా టీడీపీ నేతలు, కార్యకర్తల నినాదాలతో మార్మోగింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు ఎదుటనే తెలుగు తమ్ముళ్లు నిరసనలు, ధర్నాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

     

    గద్దెకు సీటు ఇవ్వడంపై ఆగ్రహం...

     

    విజయవాడ తూర్పు సీటును ఎంవీఆర్ చౌదరి కూడా ఆశిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ ఆయనకు ఒక బలమైన వర్గంతో పాటు పలు డివిజన్లపై పట్టు ఉంది. చంద్రబాబు ఏకపక్షంగా గద్దెకు రామ్మోహన్‌కు సీటు ఇవ్వడంతో నిరసించిన ఎంవీఆర్ చౌదరి వర్గీయులు హోటల్ ఎదుటే ధర్నాకు దిగారు.



    పార్టీ పదవులు ఇవ్వడంలో గద్దె రామ్మోహన్ తమను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కార్పొరేషన్ టిక్కెట్ల కేటాయింపులోనూ తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రెండుసార్లు ఓడిపోయిన వ్యక్తికి సీటు ఏవిధంగా కేటాయిస్తారంటూ పలువురు ఆరోపించారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు రంగంలోకి దిగి ధరా్నా చేస్తున్నవారిని శాంతింపచేశారు. అంతా సర్దుమణిగిన తరువాత గంటన్నర లేటుగా చంద్రబాబునాయుడు బయటకు వచ్చారు.

     

    జిల్లాలు దాటిన అసంతృప్తి...

     

    చంద్రబాబు నాయుడు సీట్ల పంపకంపై అసంతృప్తి జిల్లాలు దాటింది. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గీయులు విజయవాడ వచ్చి చంద్రబాబు బస చేసిన హోటల్ ఎదుట ధర్నా చేయడం స్థానిక టీడీపీ నేతల్ని ఆశ్చర్యపరిచింది. కడప నుంచి వచ్చి ఇక్కడ ధర్నా చేయడమేమిటని తీవ్రంగా చర్చించుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ టీడీపీ పరిస్థితి ఒకేలా ఉందంటూ వారు చర్చించుకోవడం కనిపించింది.

     

    టిక్కెట్ల విక్రయంపై ఆగ్రహం...

     

    టీడీపీలో టిక్కెట్లు విక్రయించుకుంటున్నారనేది బహిరంగ రహస్యమేనని స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని లింగారెడ్డి వ ర్గీయులు తేల్చిచెప్పారు. సీఎం రమేష్ రూ.25 కోట్లు తీసుకుని కాంగ్రెస్ నుంచి వరదరాజులరెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చి ప్రొద్దుటూరు టిక్కెట్ ఇచ్చారని ఆరోపించారు. కేవలం కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు పార్టీలోకి వచ్చినప్పటి నుంచే ఈ దుస్థితి పట్టిందంటూ పలువురు నేతలు బహిరంగంగానే చర్చించుకున్నారు. సీనియర్లను పక్కన పెట్టి కొత్తవారిని పార్టీలోకి తీసుకువచ్చి సీట్లు కేటాయించడంపై వారంతా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top