నేడే పోలింగ్


సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం నిర్వహించనున్నారు. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కర్నూలు, ఆదోని, నంద్యాలలోని ఆర్డీవో కార్యాలయాల్లో ఓటింగ్ జరగనుంది. మొత్తం 1087 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం అభ్యర్థులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.  మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి డి. వెంకటేశ్వరరెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థులు దండు శేషుయాదవ్, వి. వెంకటేశ్వరరెడ్డిలు బరిలో ఉన్నారు. ఈ నెల 7వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఏడో తేదీన ఎవరి భవితవ్యం ఏమిటో తెలియనుంది.

 

 ఓటమి భయంతో...!

 ఎన్నికల్లో గెలుపుకోసం అటు అధికార పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసింది. ప్రతిపక్ష పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టడం.. దారికి రాకపోతే భయపెట్టడం, రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లి మనసు మార్చడం వంటి వ్యవహారాలను నడిపింది. అయినప్పటికీ నమ్మకం లేక చివరకు ఎన్నికల రోజే ముఖ్యమంత్రి పర్యటన కాస్తా జరిగే విధంగా ప్రణాళిక రచించారు. అయితే, దీనిపై వ్యతిరేకత వస్తుందని గ్రహించడంతో పాటు నిబంధనలు అడ్డు వస్తాయని గ్రహించి చివరకు పర్యటనను కాస్తా రద్దు చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి భయం టీడీపీని వెంటాడం వల్లే ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నట్టు అర్థమవుతోందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు  ప్రధానంగా టీడీపీలోని ముఖ్యనేతలు సహకరించటం లేదని అధిష్టానానికి శిల్పా చక్రపాణి రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో వీరందరూ ఆయనపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీలో ఈ లుకలుకల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిని ఓటమి భయం వెంటాడుతున్నట్టు సమాచారం.   

   

 భారీగా బెట్టింగులు...!

 ఎమ్మెల్సీ ఎన్నికల వేడి కాస్తా చివరి అంకానికి చేరడంతో...మరోవైపు బెట్టింగ్ దందా కూడా భారీగా ఊపంకుంది. ఫలానా అభ్యర్థి గెలుస్తాడని చెబుతూ లక్షల్లో బెట్టింగులు కడుతున్నారు. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 30 నుంచి 50 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడంటూ అధికంగా బెట్టింగులు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మొదటి విడతలోనే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వస్తుందా? రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుస్తారా అన్న అంశంపైన కూడా బెట్టింగులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. లక్షకు... రెండు లక్షలు ఇస్తామంటూ ప్రధానంగా బెట్టింగు దందా సాగుతుందని సమాచారం.     

     

 బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు..!

 ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నాయి. మొత్తం నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. బ్యాలెట్‌లో అభ్యర్థి పేరు, కింద పార్టీ పేరు, పక్కన అభ్యర్థి ఫోటో ఉంది. చివరి కాలంలో ఓటు ప్రాధాన్యత...అంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తున్నారా? రెండో ప్రాధాన్యత ఓటో అన్న విషయాన్ని ఎన్నికల కేంద్రంలో ఇచ్చిన మార్కర్‌తో వేయాల్సి ఉంటుంది. మొదటిగా యువజన శ్రామిక రైతు (వైఎస్సార్) కాంగ్రెస్ పార్టీ నుంచి డి. వెంకటేశ్వరరెడ్డి ఉండగా, రెండో అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి, మూడు, నాలుగు అభ్యర్థులుగా వరుసగా దండు శేషుయాదవ్, వి. వెంకటేశ్వరరెడ్డిల పేర్లు, ఫోటోలు ఉన్నాయి. ఇక పై వారెవ్వరికీ ఓటు వేయకూడదనుకుంటే... ఐదో కాలంలో ఉన్న ‘నోటా’కు ఓటు వేయవచ్చు. అయితే, ఒకటో ప్రాధాన్యత ఒకరికి ఫోటో, రెండో ప్రాధాన్యత కింద నోటాకు వేస్తే... పూర్తిగా ఆ ఓటు చెల్లే అవకా శం లేదని ఎన్నికల సిబ్బంది పేర్కొన్నారు.

 

 నిర్భయంగా ఓటు వేయండి  

 ఓటర్లకు కలెక్టర్ సూచన

 కర్నూలు(అగ్రికల్చర్):  శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా, నిస్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు.

 

  ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 386 కేసులు నమోదు చేశామని, 400 ఆయుధాలను డిపాజిట్ చేశామని, బందోబస్తు నిమిత్తం 1 కంపెనీ పోలీసు బలగాలు జిల్లాకు వచ్చాయని వివరించారు. పోలింగ్‌ను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అవసరమైతే హౌస్ అరెస్టులు కూడా చేస్తామని పేర్కొన్నారు. ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై ఓటర్లకు శిక్షణ కూడా ఇచ్చామని తెలిపారు.

 

 ఏర్పాట్లు పూర్తి

 కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం పోలింగ్‌కు సర్వం సిద్ధమయ్యింది. పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.  కర్నూలు పోలింగ్ కేంద్రంలో 387, ఆదోని పోలింగ్ కేంద్రంలో 397 మంది, నంద్యాల పోలింగ్ కేంద్రంలో 307 మంది ఓటు వేయనున్నారు. దాదాపు 100 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉంది. సహాయకుల కోసం 116 మంది దరఖాస్తు చేసుకోగా, 110 మందికి సహాయకులను అనుమతించారు. కర్నూలు డివిజన్‌లో 47 మందికి, ఆదోని డివిజన్‌లో 37 మందికి, నంద్యాల డివిజన్‌లో 26 మంది ఓటర్ల తరపున సహాయకులు ఓట్లు వేస్తారు. పోలింగ్ కేంద్రం వారీగా ఏయే ఓటరుకు సహాయకులను నియమించింది. వివరాలు పోలింగ్ అధికారులకు ఇచ్చారు.

 

  ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక పీఓతో పాటు ముగ్గురు సిబ్బంది ఉంటారు. తహశీల్దార్లను పీఓలుగా నియమించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి విరామం లేకుండా పోలింగ్ నిర్వహిస్తారు. నలుగురు పీఓలు(తహశీల్దార్లు), ఒక మైక్రో పరిశీలకుడిని రిజర్వులో ఉంచారు. మూడు పోలింగ్ కేంద్రాలకు జోనల్ ఆఫీసర్లుగా ముగ్గురు డిప్యుటీ కలెక్టర్లను నియమించారు. ఓటర్లందరికీ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. పోలింగ్ సామాగ్రిని కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పంపిణీ చేశారు. పోలింగ్ సిబ్బందిని, మెటీరియల్‌ను ప్రత్యేక బస్సుల ద్వారా, పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించారు. కర్నూలు పోలింగ్ కేంద్రానికి జోనల్ ఆఫీసర్‌గా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రంగన్న, నంద్యాలకు డిప్యుటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆదోనికి డిప్యుటీ కలెక్టర్ సత్యం పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షిస్తూ పోలింగ్ సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తారు. కలెక్టరేట్‌లో పోలింగ్ సందర్భంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు అయింది. పోలింగ్ కేంద్రాల దగ్గర విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తగిన అనుమతులు లేనిదే పోలింగ్ కేంద్రాల్లోకి ఎవ్వరినీ అనుమతించరాదని ఆదేశించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top