ఆధ్యాత్మికం...ఆనందాల మేళవింపు

ఆధ్యాత్మికం...ఆనందాల మేళవింపు


కొత్తపేట : కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం,ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతున్నాయి. దేశ సంస్కృతి సంప్రదాయాలను,హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నాం. ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం. దీనినే కార్తీక వన భోజనాలుగా పేర్కొంటారు.



భారతీయ ఆయుర్వేదంలో వృక్ష జాతికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమే. అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువుకు పూజించి, వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతోంది. ప్రత్యేకించి ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో  కార్తీక వన భోజనాలు సమీప ఉద్యాన వనాలలో, తోటల్లో, నదీ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకుంటారు.



 భక్తి ఆధ్యాత్మిక భావనే మూలం

 పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం వెనుక భ క్తి ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్నాయి. ఁకార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద విష్ణు భగవానుని ఎన్ని పుష్పాలతో పూజిస్తే వాటి సంఖ్యను బట్టి అన్ని అశ్వమేధ యాగాల ఫలం దక్కుతుందని కార్తీక పురాణంలో లిఖించి ఉంది.



అందుకే వన భోజనాల సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణు పూజ నిర్వహించి,పంచ భక్షాలతో స్వామికి నివేదించి, అనంతరం బ్రాహ్మణులకు దానాలిచ్చి బంధు,మిత్ర సపరివారంగా భుజిస్తే అఖిలాండ భూమండలంలో ఉన్న సమస్త పుణ్యక్షేత్రాలలో మహావిష్ణువును కొలిచిన పుణ్యం ఫలం దక్కుతుందని ప్రతీతి.



 కళా ప్రావీణ్య ప్రదర్శనకు చక్కటి వేదిక

 కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆట,పాట కబుర్లకు ఇది చక్కటి వేదిక. పిల్లలు,పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే క్రీ డలు, నృత్యాలు, సంగీత కచేరీలు నిర్వహించడానికి మంచి అవకాశం. వనభోజనాల మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. మానవ మనుగడకు వనాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వనసమారాధన అందిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top