ఏ రాయి కూలునో..!

ఏ రాయి కూలునో..!


తిరుపతి నుంచి తిరుమలకు వాహనాల్లో వెళ్లే ప్రయాణికుల గుండెలు అరచేత పట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో రెండో ఘాట్‌రోడ్డులో భారీ కొండ చరియలు విరగిపడుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఏకంగా 50 టన్నుల కొండ కూలింది.

 

సాక్షి, తిరుమల: తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో సుమారు ఇరవై ప్రాంతా ల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అలిపిరి నుంచి ఎనిమిది కిలోమీటర్ల తర్వాత నుంచి తిరుమలకు చేరే వరకు కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. ఇందులోనూ చివరి ఐదు మలుపులు (హెయిర్ పిన్ కర్వ్స్) వద్ద చాలా ప్రాంతాల్లో కొండ చరియలు కూలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఏడేళ్లకు ముందు త్రోవ భాష్యకార్ల సన్నిధి సమీపంలోని మలుపు వద్ద భారీగా కొండచరియలు విరిగి పడడంతో అప్పట్లో ప్రత్యేకంగా ఇంజినీరింగ్ నిపుణులను రప్పించి వాటిని తొలగించారు. అక్కడే భారీ ఇనుపరాడ్లను కొండ బొరియల్లోకి దించారు. ప్రత్యేకంగా ఇనుప కంచె (ఫెన్సింగ్) నిర్మించారు.



చివరి మలుపు వద్ద  భారీగా కొండ చరియలు విరిగి పడడంతో రెండేళ్లకు ముందు అక్కడ రాక్‌బౌల్టర్ ట్రాప్ (ఇనుప కంచె) నిర్మించారు. దీనివల్ల బండరాళ్లు దొర్లినా ఇనుప కంచెలో పడుతుండడంతో ప్రమాదాలు తప్పుతున్నాయి. ఇలాంటి పరిస్థితులే సుమారు మరో ఇరవై ప్రాంతాల్లో వెలుగుచూస్తుండడం ఇంజినీరింగ్ ఉన్నతాధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొండరాళ్లు కూలే ఘటనల్లో ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. భవిష్యత్‌లో అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



అందుకు అనుగుణంగా భద్రతాపరంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. కొండ చరియలు విరిగి పడుతున్న రెండో ఘాట్‌రోడ్డులో  వాహనదారులు, ద్విచక్రాలపై వెళ్లే  ప్రయాణికులు అప్రమత్తంగా వెళ్లాలని అధికారులు సూచించారు. మొదటి ఘాట్‌రోడ్డులోని అవ్వాచ్చారి కోన ఎగువ ప్రాంతం, కపిలతీర్థం నుంచి అలిపిరి వరకు మాత్రమే కొండచరియలు అడపా దడపా విరిగి పడుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఈ పరిస్థితులు లేవని ఇంజినీర్లు చెబుతున్నారు.

 

కూలుతున్న బండరాళ్లపైటీటీడీ అప్రమత్తం



తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌రోడ్డులో ఆదివారం కూడా కొండచరియలు కూలాయి. శుక్రవారం అర్ధరాత్రి 50 టన్నుల కొండ కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖరరెడ్డి ఆదేశాలతో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివరామకృష్ణ, డెప్యూటీ ఇంజినీర్ సురేంద్రరెడ్డి అప్రమత్తంగా ఉంటున్నారు. కూలిన ప్రాంతంలో మరమ్మతు పనులు, కొత్త రివిట్‌మెంట్ (గోడ) నిర్మాణం  చేపట్టారు. ప్రతి రెండు గంటలకు ఘాట్‌రోడ్డు మొబైల్‌పార్టీ వాహనాల్లో ఇంజినీరింగ్ సిబ్బందిని పంపించి పడిన రాళ్లను తొలగించారు. దీంతో మొదటి, రెండో ఘాట్‌రోడ్లలో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు. దీనికితోడు టీటీడీ విజిలెన్స్ విభాగం ఏవీఎస్‌వోలు కూర్మారావు, వెంక టాద్రి కూడా కొండ చరియలు కూలినట్టు సమాచారం అందితే అందుకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top