వైకుంఠంలోనూ అదనపు లడ్డూలు


సాక్షి, తిరుమల: తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో సామాన్య భక్తులకు ప్రస్తుతం సబ్సిడీ ధరకు ఒక్కొక్కటి రూ. 10 చొప్పున ఇస్తున్న రెండు లడ్డూలతోపాటు ఒక్కొక్కటి రూ. 25 చొప్పున మరో రెండు లడ్డూలు ఇవ్వాలని శుక్రవారం టీటీడీ ఈవో డి.సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నిర్ణయించారు. సర్వదర్శనం క్యూలో వెళ్లే భక్తులకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో సబ్సిడీ ధర  రూ. 10 చొప్పున రూ. 20కి రెండు లడ్డూ టోకెన్లు అందజేస్తున్నారు.



కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తులకు ఒక లడ్డూ ఉచితంగానూ, రూ. 10 చొప్పున రూ. 20కి  రెండు లడ్డూ టోకెన్లు ఇస్తున్నారు. దీంతోపాటు భక్తులు అదనంగా లడ్డూలు తీసుకునేందుకు ఆలయం  వెలుపల అదనపు లడ్డూ కౌంటర్ ద్వారా రూ. 25 చొప్పున రూ. 50కి రెండు, రూ. 100కి నాలుగు లడ్డూలు ఇస్తున్నారు.  ఇదే తరహా కౌంటర్‌ను వైకుంఠం కాంప్లెక్స్‌లోనూ ప్రారంభించి భక్తులకు రూ. 25 చొప్పున రూ. 50కి రెండు లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించారు.



మళ్లీ రూ. 2 కవర్ల విక్రయం

బుధవారం నుంచి భక్తులకు టీటీడీ కవర్లు (బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులు) ఉచితంగా అందజేశారు. అదనపు కవర్ల కోసం భక్తుల నుంచి  ఫిర్యాదులు రావడంతో 48 గంటలు గడవకు ముందే ఉచిత కవర్ల విధానాన్ని టీటీడీ ఉపసంహరించుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి రూ. 2 చొప్పున కవర్ల విక్రయాన్ని తిరిగి ప్రారంభించింది.



లక్కీడిప్ కోటా విడుదల

సామాన్య భక్తులు అరుదైన సేవల్లో శ్రీవారిని దర్శించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. దానిలో భాగంగా లక్కీడిప్ ద్వారా టికెట్లు పొందేందుకు ఫిబ్రవరి కోటాను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో తోమాలసేవ 15 టికెట్లు (ఒకరికి రూ. 220), అర్చన 132 (ఒకరికి రూ. 220), మేల్‌ఛాట్‌వస్త్రం 4 (దంపతులకు రూ. 12,250), పూరాభిషేకం 24 (ఒకరికి రూ. 750) టికెట్లు అందుబాటులో ఉన్నాయి.



ఆయా తేదీల్లో ఆలయంలో శ్రీవారికి నిర్వహించే సేవలకు ముందు రోజు తిరుమలలోని విజయా బ్యాంకులో లక్కీడిప్ ద్వారా భక్తులకు టికెట్లు కేటాయిస్తారు. కాగా, శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాలు పేరుకు పోనీయకుండా ప్రతి నెలా ఈ-టెండర్లు నిర్వహించాలని టీటీడీ ఈవో ఆదేశించారు. ఈ విషయంపై శుక్రవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజుతో కలిసి అధికారులతో చర్చించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top