విద్యుత్ షాక్‌కు పులి బలి!

విద్యుత్ షాక్‌కు పులి బలి!


తొగిరి(సారవకోట రూరల్):అడవి జంతువుల మాంసం రుచి మరిగిన కొంతమంది వాటిని హతమార్చడానికి విద్యుత్ తీగలను ఉపయోగించారు. వారి కోరిక నెరవేరింది. అడవి పందులు, కుందేళ్లకు బదులు ఏకంగా చిరుత పులే చిక్కింది. విద్యుత్ తీగలను తాకి షాక్‌తో చనిపోవడంతో మాంసాన్ని వాటాలు వేసుకొని అందరూ ఆరగించారు. అంతవరకూ సజావుగా సాగిన మానవమృగాల పన్నాగం పులి గోళ్ల పంపకం విషయంలో తేడాలు రావడంతో విషయం వెలుగు చూసింది. అధికారులు మేల్కొని కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంచలనం రేపిన ఈ సంఘటన సారవకోట మండలంలోని తొగిరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తొగిరి రెవెన్యూ పరిధిలోని బక్కిరికొండ ప్రాంతంలో అటవీ ప్రాంతం విస్తారంగా ఉంది. దీంతో వివిధ అటవీ జంతువులు జీవిస్తున్నాయి. వీటిని హతమార్చి మాంసాన్ని తినడం హాబీగా చాలామంది మార్చుకున్నారు. కొండ దిగువున ఉన్న వాట్‌షెడ్ వద్దకు మూగ జీవాలు నీటి కోసం వస్తుంటాయి.

 

 దీంతో వీటిని చంపేందుకు కొండపైన ఉన్న జీడితోట చుట్టూ కొంతమంది విద్యుత్ తీగలను అమర్చారు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి కూడా ఓ పులి నీటి కోసం వస్తూ విద్యుత్ తీగలను తాకి షాక్‌కు గురై మృతి చెందింది. దీంతో గ్రామస్తులు గుట్టు చప్పుడు కాకుండా శనివారం మధ్యాహ్నం జీడి తోట మధ్యలోకి చనిపోయిన పులిని తీసుకెళ్లి చర్మాన్ని తీసి  పంచుకున్నారు. అయితే అదేరోజు సాయంత్రం పులి గోళ్ల పంపకంలో వీరి మధ్య తగాదా వచ్చింది. దీంతో కొంతమంది కోపంతో విద్యుత్ ఎర్త్ కారణంగా పులి చనిపోవడం, దాని మాంసాన్ని పంచుకోవడం, తల, పొట్టెను పాతిపెట్టిన విషయూన్ని ఆదివారం ఉదయం సారవకోట ఎస్‌ఐ గణేష్, పాతపట్నం అటవీ రేంజర్ యాళ్ల సంజయ్‌కు చేరవేశారు. దీంతో ఎస్‌ఐ గణేష్ తన సిబ్బంది రవి, గోపాలరావులతో, సారవకోట అటవీ సెక్షన్ అధికారి వెంకటరావు, వీఆర్వో గజపతినారాయణలు సంఘటన స్థలం కోసం గాలించారు.

 

 అడవి పంది మాంసం తీసుకెళ్తూ...

  కానిస్టేబుల్ గోపాలరావు పులి తలను పాతిపెట్టిన స్థలం కోసం వెతుకుతుండగా తొగిరి గ్రామానికి చెందిన సడగాన గోవిందరావు, బైరి సింహాచలంలు అనుమానాస్పదంగా చేతులకు రక్తం మరకలు, కత్తులతో వారికి తారసపడ్డారు. అలాగే తండ్యాల సింహాచలం అనే వ్యక్తి బకెట్‌తో మాంసం పట్టుకుని పారిపోతూ కనిపించారు. దీంతో గోవిందరావు, సింహాచలాన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా విద్యుత్‌షాక్‌తో అడవి పంది చనిపోవడంతో దీన్ని మాంసం చేసి తీసుకెళ్తున్నామని వివరించారు. పులి విషయమై ఆరా తీయగా శుక్రవారం పులి చనిపోవడంతో గ్రామస్తులమంతా పంచుకున్నామని వివరించారు. దీంతో మరింత లోతుగా పోలీసులు,

 

 అటవీశాఖాధికారులు వారిని విచారణ చేయగా తల, పొట్టు పాతిపెట్టిన స్థలాన్ని చూపించడంతో వారి చేతనే పాతిపెట్టిన వాటిని బయటకు తీయించి పరిశీలించారు. అలాగే విద్యుత్ ఎర్త్‌లు పెట్టే నేతింటి శ్రీనివాసరావును కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. కొన్ని రోజులుగా కొండ ప్రాంతంలో ఎర్త్‌లు పెడుతున్నట్టు ఆయన అంగీకరించాడు. పులి చనపోరుున విషయూన్ని  అటవీశాఖ ఏసీఎఫ్ శ్రీహరగోపాల్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తల, పొట్టు మంసాహార జంతువుదిగా గుర్తించామన్నారు. దొరికిన తల భాగాన్ని చీడిపూడి పశువైద్యాధికారి ఓంకార్ ప్రాథమిక పరిశీలించారని, హైదారాబాద్‌లో ఉన్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీకి పంపిస్తామన్నారు. అక్కడ నుంచి వచ్చే రిపోర్టులు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం సడగాన గోవిందరావు, బైరి సింహాచలం, నేతింటి శ్రీనివాసరావుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూరిస్థాయి నివేదిక వస్తేగాని చనిపోరుునది పులా..కాదా అనే విషయం తెలియదన్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top