సబ్ డివిజన్‌గా తుళ్లూరు స్టేషన్


రాజధాని నేపథ్యంలో అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధానిగా మారుతున్న తుళ్లూరులో శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు అవసరాలపై రాష్ట్ర పోలీసు విభాగం దృష్టి పెట్టింది. తుళ్లూరు పోలీసుస్టేషన్‌ను సబ్-డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇతర అవసరాలకు సంబంధించి పూర్తి ప్రతిపాదనలు పంపాల్సిందిగా గుంటూరు జోన్ ఐజీ పీవీ సునీల్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయం ఆదేశించింది.



గుంటూరు గ్రామీణ జిల్లాలోకి వచ్చే తుళ్లూరు పోలీసుస్టేషన్ ప్రస్తుతం అమరావతి సర్కిల్‌లో ఉంది. అమరావతితో పాటు సత్తెనపల్లి, అర్బన్, రూరల్, పిడుగురాళ్ల అర్బన్, రూరల్ సర్కిళ్లు సత్తెనపల్లి సబ్-డివిజన్‌లో ఉన్నాయి. పోలీసుస్టేషన్ స్థాయిలో ఉన్న తుళ్లూరుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ హోదాలో ఇన్‌చార్జ్‌గా సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎసై్స) స్థాయి అధికారి ఉంటారు. కొత్త రాజధాని ఏర్పాట్ల నేపథ్యంలో ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి మొదలు అనేక మంది ప్రముఖుల తాకిడి ఉంటుంది. దీనికోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.



మరోపక్క కొత్త రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలను ఆకర్షించాలంటే అక్కడ శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ఆ ప్రాంతంలో జరుగుతున్న భారీ ఆర్థిక లావాదేవీలు నేరగాళ్లను సైతం ఆకర్షిస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న డీజీపీ కార్యాలయం తక్షణ అవసరంగా తుళ్లూరును సబ్-డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేసి డీఎస్పీని నియమించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రస్తుతం ఉన్న సత్తెనపల్లి సబ్-డివిజన్‌ను పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. దీని పరిధిలో ఉన్న సర్కిళ్లు, పోలీసుస్టేషన్లను తుళ్లూరులో కలపాలని యోచిస్తున్నారు. ప్రతి పోలీసుస్టేషన్‌కు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఎసై్సకి బదులు ఇన్‌స్పెక్టర్‌ను నియమించే ఆలోచన ఉన్నతాధికారులకు ఉంది.



ఏపీ పోలీసుకు కొత్త డీఎస్పీలు

శిక్షణ పూర్తి చేసుకున్న 2012 బ్యాచ్‌కు చెందిన 34 మంది డీఎస్పీలను ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి కేటాయించారు. వీరు మంగళవారం డీజీపీ జాస్తి వెంకట రాముడుకు రిపోర్ట్ చేశారు. ఈ అధికారులకు నిబంధనలకు అనుగుణంగా పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు డీజీపీ కార్యాలయం కసరత్తులు చేస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top