సిరికి ఉరి


తుళ్లూరు..తాజాగా అధికారులు, అధికార పార్టీ నేతల నోళ్లల్లో నానుతున్న మండలం ఇది.. నవ్యాంధ్ర నిర్మాణంలో భాగంగా భూసేకరణ చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించి గుర్తించిన మండలం కూడా ఇదే..అందుకే జిల్లాలోని అందరి దృష్టి ఇక్కడే.....



 రైతుల భూములను సేకరించాలని ఓ వైపు అధికారులపై ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి...మరో వైపు భూములు ఇవ్వబోమంటున్న రైతులు...రెండు పరస్పర విరుద్ధాల మధ్య తుళ్లూరు మండలం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

 

 భూములు ఇచ్చేందుకు రైతులు ఎందుకు ఒప్పుకోవడం లేదు?, భూములు ఇస్తే ఎదురయ్యే పరిణామాలు ఏమిటీ ?, ఈ కోణంలో ఆలోచించగలిగితే రైతుల దూర దృష్టి అర్థమవుతోంది. ఎందుకు ఇవ్వనంటున్నారో బోధపడుతోంది. ఇవ్వడం వల్ల జరిగే అనర్థాలు అవగతమవుతాయి.. వ్యవసాయ ప్రాంతమైన తుళ్లూరు మండలానికి రాష్ట్రంలోనే ఏ జిల్లాకు లేని ప్రత్యేకత  ఉంది. ఎక్కడా లేని విధంగా మూడు ఎత్తిపోతల పథకాలు ఇక్కడే ఉన్నాయి. అంతేనా సారవంతమైన భూములతో సిరిసంపదలకు నిలయం.. నిత్యకల్యాణం పచ్చ తోరణంలా రైతులు బంగరు పంటలు పండిస్తుంటారు. మరి అలాంటి భూములను ప్రభుత్వం తీసుకుంటే ఇప్పటి వరకు పండే పంటల పరిస్థితి ఏమిటి ?, వ్యవసాయ ఉత్పత్తుల మాటేమిటి?, ఆదాయ వనరుల మా టేమిటి? అందుకే సమాజ శ్రేయస్సు కాంక్షిస్తున్న తుళ్లూరు రైతులు పంటలు పండే సారవంతమైన భూములు ఇవ్వబోమంటున్నారు. ప్రభుత్వం అనుకున్నదే జరిగితే సిరికి ఉరేనంటున్నారు.

 

 తుళ్లూరు:  తుళ్ళూరు మండలంలోని 19 గ్రాామ పంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు, మొత్తం 33వేల 247 ఎకరాల సాగు భూమి వుంది. ఈ వేలాది ఎకరాల్లో ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలు సాగవుతుంటాయి. దాదాపు 15 వేల మంది రైతులు సేద్యాన్ని,  50 వేల మంది కూలీలు శ్రమను నమ్ముకుని బతుకుతున్నారు. ఇంకా పరిశీలిస్తే పండే పంటలు ఇలా కనిపిస్తాయి. పత్తి 6,500 ఎకరాలు, మిరప 997, మినుము 1200, పెసర 1000, శనగ 1500, పసుపు 86, అరటి 2898, దొండ99, కంద 560, బీర 71, దోస 30, బెండ 38, ఫ్లవర్స్ 25, నిమ్మ 580, క్యాలీఫ్లవర్ 150, కరివేపాకు 44, జామ 79, సపోటా 5, యూకలిప్టస్ 5 ఎకరాల్లో, ఇంకా చెరకు, క్యాబేజీ, క్యారెట్ ఇతర పంటలు సాగవుతున్నాయి. పచ్చని పంటలతో కళకళలాడే  మండలం చెంత కృష్ణానది పాయ మరింత అందాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తోంది. బ్యారేజీ బ్యాక్‌వాటర్ ప్రభావంతో మండలంలోని 12 గ్రామాలలో భూగర్భ జలసంపద తొణికిసలాడుతుంటుంది. ఏడాదికి మూడు పర్యాయాలు , మూడు రకాల పంటలు సాగు చేసే రైతులు జిల్లాకు ఆహార ఉత్పత్తుల అందజేతలో కీలక పాత్ర పోషిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

 ఇప్పుడేం జరుగుతోంది...

 

  రాజధాని నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలంలో భూసేకరణ అంశం ఇటు రైతులు, అటు ప్రజల్లో కలకలం  రేపుతుంది. తెలుగుదేశం ప్రభుత్వ విధానాలకు రైతులు తల్లడిల్లుతున్నారు. పంటలు పండని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు వున్నా ఈ మండలం పైనే సీఎం ఎందుకు దృష్టి సారించారని  రైతులు ప్రశ్నిస్తున్నారు. భూసేకరణ కోసం ప్రభుత్వం పంపిన అధికారులు బలవంతంగా  రైతులను ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని నిలదీస్తున్నారు.



  ఇదిలావుంటే, తొలుత ఇక్కడే రాజధాని రాబోతుందనే ప్రచారం ఊపందుకోగానే తుళ్లూరు మండ లంలో ఎకరం పొలం రూ. కోటి కి పైగానే కొనేందుకు రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ముందుకు వచ్చారు. అక్కడక్కడా కొనుగోలు చేశారు. ఇంతలోనే ప్రభుత్వం భూసేకరణ జరుపుతుందని తెలియగానే రూ. కోటి నుంచి రూ. 50 లక్షలకు దిగజారాయి. రైతుల బలహీనతలను వాడుకుంటూ రియల్టర్‌లు భూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top