బైక్‌ను ఢీకొట్టిన మాజీ ఎంపీ తనయుడి కారు

బైక్‌ను ఢీకొట్టిన మాజీ ఎంపీ తనయుడి కారు - Sakshi


ముగ్గురికి తీవ్రగాయాలు

 అతివేగమే ప్రమాదానికి కారణం


 

 కోలమూరు(రాజమండ్రిరూరల్) :మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడి కారు అతివేగంగా దూసుకొచ్చి ఓ మోటరు బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన  కోలమూరు గ్రామంలో శనివారం రాత్రి 11గంటలకు జరిగింది.  స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ద్వితీయ కుమారుడు సుందర్‌కి చెందిన కారు కోరుకొండ వైపు నుంచి రాజమండ్రి వెళ్తుంది. కోలమూరు గ్రామం వద్దకు వచ్చేసరికి డివైడర్‌ను ఢీకొట్టి, మళ్లీ కిందకి దిగి, వెంటనే డివైడర్‌పై నుంచి కోలమూరు వైపు వస్తున్న మోటర్‌బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుచక్రం విరిగిపోవడంతో వంద మీటర్ల దూరం వెళ్లి ఆగింది.

 

 వెంటనే కారులో ఉన్న నలుగురు డోర్లు తీసుకుని  అక్కడి నుంచి పరారయ్యారు. బెక్‌పై ఉన్న కోలమూరు గ్రామానికి చెందిన చిర్రామహేష్, కొల్లిచంటి, పోసిపో మనోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించేందుకు 108కు ఫోన్‌చేసినా సకాలంలో రాకపోవడంతో రాత్రి 01.15గంటలకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి స్థానికులు తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొల్లి చంటి తలకు బలమైన గాయం కావడంతో విజయవాడకు తరలించారు. చిర్రా మహేష్ ఫిర్యాదు మేరకు రాజానగరం ఎస్సై దుర్గా శ్రీనివాసరావు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.

 

 అతివేగమే కారణం

 కారును అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కారు నడిపే వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడన్న అనుమానాలనూ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో ఉండడంవల్లే డివైడర్‌పై నుంచి కారు దూసుకువెళ్ళి ఉంటుందని చెబుతున్నారు. కనీసం కారుకు నంబరు లేకపోవడం విశేషం. రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ అని నంబరు బోర్డులో ఉందే తప్ప ఎటువంటి నంబరు లేదు. కారు వెనుక మాత్రం సుందర్ అనేపేరు ఉంది. దీంతో ఇది హర్షకుమార్ తనయుడి వాహనమని పోలీసులు గుర్తించారు.  

 

 ప్రాణాలు కాపాడిన బెలూన్లు

 కారు డివైడర్‌పైకి దూసుకెళ్లి మొదటి చక్రం విరిగిపోయినా కారులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడడానికి అందులో ఉన్న బెలూన్లే కారణంగా తెలుస్తోంది. బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ఉన్న నలుగురి ప్రాణాలు దక్కాయి. లేకపోతే భారీ ప్రమాదమే జరిగి ఉండేదని పోలీసులు భావిస్తున్నారు.  ప్రమాదం జరిగిన తరువాత కారుకు సంబంధించిన ఎటుంటి ఆదారాలూ దొరక్కుండా అందులోని వారు రికార్డులను పట్టుకు వెళ్లిపోయారు.

 

 ఘటనాస్థలానికి హర్షకుమార్

 ఘటనా స్థలాన్ని మాజీ ఎంపీ హర్షకుమార్ పరిశీలించి ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షి సుధాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరిశీలించి వారికి మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులకు సూచించారు. తీవ్ర గాయాలైన కొల్లిచంటిని విజయవాడకు మెరుగైన వైద్యం కోసం తరలించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top