ఐపీఎస్ కుటుంబం

ఐపీఎస్ కుటుంబం

  •    ఒకే ఇంట్లో ముగ్గురు ఐపీఎస్‌లు

  •   తండ్రి విష్ణువర్థన్ హైదరాబాద్ సదరన్ సెక్టార్ ఐజీ

  •   ఏసీపీగా శిక్షణ పొందుతున్న తనయుడు హర్షవర్థన్

  •   తాజాగా ఐపీఎస్‌కు ఎంపికైన కుమార్తె దీపిక

  •   13 పాఠశాలలు మారినా లక్ష్యం సాధించారు

  • కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటేనే కఠోరంగా శ్రమించాల్సిన  నేపథ్యంలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు ఒకే ఇంటి నుంచి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐపీఎస్ అధికారిగా విధులు  నిర్వహిస్తున్న తమ తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని ఆయన కుమారుడు, కుమార్తె కూడా ఐపీఎస్‌కు ఎంపికై తండ్రికి తగ్గ పిల్లలుగా పేరు తెచ్చుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

     

    ఆముదార్లంక (చల్లపల్లి) :  గ్రామానికి చెందిన మండవ విష్ణువర్థన్ ప్రస్తుతం హైదరాబాద్ సదరన్‌సెక్టార్‌లో ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు హర్షవర్థన్, కుమార్తె దీపిక కూడా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. వారిని పలువురు అభినందనలతో ముంచెత్తుతున్నారు. విష్ణువర్థన్ 1987లో ఐపీఎస్‌గా ఎంపికై దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి, సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు.



    ప్రస్తుతం హైద రాబాద్ సదరన్ సెక్టార్‌లో కేంద్ర సర్వీసుల విభాగంలో ఐజీగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు హర్షవర్థన్ 2012లో తొలిసారి  సివిల్స్‌రాసి 165వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆయన పశ్చిమఢిల్లీలో ఏసీపీగా శిక్షణ తీసుకుంటున్నారు. కుమార్తె దీపిక 2013లో నిర్వహించిన సివిల్స్‌లో 135వ ర్యాంకు సాధించి తండ్రికి తగ్గ తనయగా నిరూపించారు.



    తొలిసారిగానే ఈ ఘనత సాధించి, తన సోదరుడి కంటే ఉత్తమ ర్యాంకు తెచ్చుకున్నారు. ఇంటర్ వరకు బీహార్‌లో చదివిన దీపిక  బిట్స్‌పిలానీ(రాజస్థాన్)లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం అక్కడే ఎంఎస్సీ, ఎకనామిక్స్ పూర్తి చేసిన ఆమె తొలిప్రయత్నంలోనే సివిల్స్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఆమె రెండేళ్లపాటు ఐపీఎస్ శిక్షణ తీసుకోనున్నారు.

     

    13 పాఠశాలలు మారినా...

     

    తండ్రి విష్ణువర్థన్ ఉద్యోగరీత్యా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎస్పీ, ఐజీగా పనిచేశారు. దీంతో హర్షవర్థన్, దీపిక ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకూ మొత్తం 13 పాఠశాలలు, కళాశాలల్లో చదవాల్సి వచ్చింది. వీరిద్దరూ అన్ని విద్యాసంస్థలు మారినా చదువులో మాత్రం ఎప్పుడూ వెనుకబడలేదు. తొలినుంచి తరగతిలో ప్రథమ స్థానంలోనే ఉన్నారు. తండ్రి స్ఫూర్తితో తాము          ఐపీఎస్ సాధించాలనే తపనతో అహ ర్నిశలూ శ్రమించి లక్ష్యాన్ని సాధించారు.

     

    సేవాకార్యక్రమాల్లోనూ..




    ఉద్యోగరీత్యా విష్ణువర్థన్ ఆముదార్లంకను వదిలి వేరే ప్రాంతానికి వెళ్లినా ఏటా ఆయన కుటుంబ సమేతంగా రెండు, మూడు సార్లు గ్రామానికి వస్తుంటారు. సొంతూరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఐదేళ్ల క్రితం ‘పరివర్తన’ సచ్ఛంద సంస్థ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హర్షవర్థన్ ఈ సంస్థ ద్వారా మిత్రబృందంతో కలిసి ఆముదార్లంక, జువ్వలపాలెం, పెసర్లంకలో రెండేళ్ల క్రితం టెలిమెడిసిన్ విధానం ద్వారా వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం ఆముదార్లంక, పెసర్లంక, కిష్కిందపాలెం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక పరికరాలను ఏర్పాటుచేసి ఈ-తరగతులు నిర్వహిస్తున్నారు. ఉన్నత స్థానంలో ఉన్నవారితో ఇంటర్‌నెట్ ద్వారా నేరుగా ఈ పాఠశాలల్లోని విద్యార్థులకు కౌన్సెలింగ్, సూచనలు, సలహాలు అందించడంతోపాటు నిష్ణాతులైన అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తున్నారు.

     

     తండ్రి స్ఫూర్తి.. తల్లి ప్రోత్సాహం



     నేను ఐపీఎస్‌కు ఎంపికయ్యానంటే దానికి మా తండ్రి



     విష్ణువర్థనే స్ఫూర్తి. నేను ఆడపిల్లనన్న దృష్టితో చూడకుండా మా అమ్మ భవాని ఎల్లప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహించేది. ఎవరైనా ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటే దానిని సాధించే వరకు తపన పడాలి. ఎందులోనూ భయపడకూడదు. ఇంటర్‌నెట్ వల్ల నేడు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఐపీఎస్ అధికారిగా ప్రజలకు న్యాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటా.         

    - మండవ దీపిక

     

     ప్రజల మెప్పు పొందితే మరింత ఆనందం



    నా పిల్లలిద్దరూ నాలాగానే ఐపీఎస్‌కు ఎంపికవడంతో ఎంతో సంతోషంగా ఉంది. వారు ప్రజలకు మరింత చేరువై వారికి న్యాయం చేయడం ద్వారా ప్రజల మెప్పు పొందినపుడు మరింత ఆనందంగా కలుగుతుంది. ఏ వ్యక్తీ తమకు తాము తక్కువ అంచనా వేసుకోకూడదు. ఎన్నోసార్లు అపజయాలు పొందినా, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి.

    - మండవ విష్ణువర్థన్, ఐజీ, సదరన్ సెక్టార్, హైదరాబాద్

     

    ‘పరివర్తన’ ద్వారా మరిన్ని సేవలు

    గ్రామీణ ప్రాంతంలో ఎందరో మేధావులు ఉన్నారు. గతంలో ఏదైనా సాధించాలంటే గెడైన్స్ పెద్ద సమస్యగా ఉండేది. ఇంటర్‌నెట్ వచ్చిన తరువాత ఆ సమస్యేలేదు. లక్ష్యాన్ని సాధించాలనుకునే వారు ఇంటర్‌నెట్‌ను సద్వినియోగం చేసుకుని అహర్నిశలూ కష్టపడాలి. ఉద్యోగ బాధ్యతలతోపాటు  ఈ ప్రాంతానికి పరివర్తన స్వచ్ఛంద సంస్థ ద్వారా మరిన్ని సేవలు అందిస్తాం.    

     

    - మండవ హర్షవర్థన్

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top