పోలీసుల్ని బెదిరించిన కేసులో

పోలీసుల్ని బెదిరించిన కేసులో - Sakshi


చింటూ అరెస్టు

నిరసనగా రోడ్డుపై టీడీపీ నేతల బైఠాయింపు


 

చిత్తూరు (అర్బన్): చిత్తూరు టీడీపీ నాయకుడు కఠారి మోహన్ బావమరిది చింటూ అనే చంద్రశేఖర్‌ను స్థానిక వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐను బెదిరించారంటూ నాటకీయ పరిణామాల మధ్య చింటూను అరెస్టు చేసిన పోలీసులు అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. చింటూ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై 2007లో జరిగిన రెండు హత్యాయత్నాల కేసుల్లో రెండో నిందితుడిగా ఉన్నాడు. చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు కథనం మేరకు.. సీకే బాబుపై జరిగిన కాల్పుల ఘటన కేసు విచారణలో భాగంగా ఈ నెల 26న చింటూ న్యాయస్థానం ఆవరణలోకి వస్తుండగా అతని ముందు వెళుతున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేసు విచారణ జరుగుతున్న వ్యక్తుల వాహనాలు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న వన్ టౌన్ ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌కు, చింటూకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అదే రోజు రాత్రి ఎస్‌ఐ లక్ష్మీకాంత్ వన్‌టౌన్ పోలీసులకు చింటూపై ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న తనను డ్యూటీ చేయకుండా అడ్డుకున్నాడని, అంతు చూస్తామని బెదిరించాడని పేర్కొన్నారు.



వన్‌టౌన్ ఏఎస్‌ఐ గుణశేఖర్ చింటూపై ఐపీసీ 353, 506 రెడ్‌విత్ 34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. శుక్రవారం న్యాయస్థానం ఎదుట హాజరై వస్తున్న చింటూను పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్‌కు తరలించారు.ఎలాంటి తప్పు చేయకుండా చింటూను ఎలా అరెస్టు చేస్తారంటూ చిత్తూరు టీడీపీ నాయకులు చిత్తూరు నగరంలో నిరసనలు వ్యక్తం చేశారు. మేయర్ కఠారి అనురాధ, దేశం నాయకులు కఠారి మోహన్, పలువురు కార్పొరేటర్లు గాంధీ విగ్రహం ఎదుట, వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అనంతరం చింటూకు చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top