పేలవంగా రైతు సాధికార సదస్సులు


విజయనగరం కంటోన్మెంట్: ఈనెల 11 నుంచి జిల్లాలో నిర్వహించిన రైతు సాధికార సదస్సులు పేలవంగా ముగిశాయి. ఎన్నికలముం దు ఓట్లకోసం చంద్రబాబు చేసిన రుణమాఫీ హామీని అమలుచేయకుండా కొద్దిపాటి రు ణాల కోసం రైతులందర్నీ సదస్సులకు రమ్మని పిలవడంతో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ సదస్సులకు ఎక్కడా రైతులు హాజరు కాకపోవడం విశేషం. ఫలితంగా జిల్లాలోని 34 మండలాలు, నాలుగుమున్సిపాలిటీల్లో జరిగిన ఈ సదస్సులు రైతులు లేక తుస్సుమన్నాయి. అసలే రుణమాఫీ జరగక  ఇబ్బందులు పడుతున్న రైతులకు  రుణాలివ్వకుండా బ్యాంకర్లు మరింత మొండికేశారు. ఈ సమయంలో పెట్టుబడులకు ఇబ్బందులు పడి ఏదోలా వ్యవసాయం చేస్తున్న రైతులను సదస్సులకు రమ్మని, రుణ ఉపశమన పత్రాలు ఇస్తామని ఊదరగొట్టారు.

 

 అయినప్పటికీ రైతులు హాజరు కాకపోవడంతో కొన్నిచోట్ల పింఛనర్లతో, మరికొన్ని చోట్ల ఉపాధికూలీలతో సదస్సులు నిర్వహించారు. సాలూరు మున్సిపాలిటీలో ఒక సదస్సుకూ రైతులు హాజరు కాకపోవడం విశేషం. అలాగే రుణ ఉపశమన పత్రాలను ఇస్తామని చెప్పిన అధికారులు వాటిని కూడా ఇవ్వలేదు. దీంతో మక్కువ మండలం మార్కొండ పుట్టి తదితర గ్రామాల్లోని రైతులకు రుణ మాఫీ పత్రాలు కూడా ఇవ్వని సదస్సులు ఎందుకని అధికారులను నిలదీశారు. గుర్ల మండలం గుజ్జంగి వలసలో బేషరతుగా రూ.లక్షా50 వేల రుణమాఫీ చేస్తామని చెప్పిన యంత్రాంగం ఇప్పడు వందలు, వేలల్లో విడతల వారీగా మాఫీ అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.

 

 దత్తిరాజేరు మండలం గర్భాంలో చివరి రోజైన మంగళవారం నిర్వహించిన సదస్సులో ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్  తదితరులు చెప్పి వెళ్లిపోయారు. ఇలా పార్వతీపురం, పాం,బొబ్బిలి,సాలూరు,ఎస్‌కోట,విజయనగరం,నెల్లిమర్ల,గజపతినగరం,చీపురుపల్లి నియోజకవర్గాల్లో రుణమాఫీ పత్రాల పంపిణీ బూటకమని స్వపక్షాలనుంచే విమర్శలుఎదుర్కొన్నారు. సదస్సులు అవుతున్నప్పుడే నాకు మూడురూపాయలు మాఫీ అయిందని ఒకరు,95 రూపాయలు అయిందని మరొకరు పత్రాలు పట్టుకుని సోమవారం   గ్రీవెన్స్ సెల్‌కు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి  ప్రభుత్వం మాయమాటలతోనే  రైతు సాధికార సదస్సులను ముగించిందని జిల్లా రైతాంగం  ఆవేదన వ్యక్తం చేస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top