ఇదీ పోలీస్ న్యాయం!

ఇదీ పోలీస్ న్యాయం! - Sakshi

  •      పోలీస్ జీపు ఢీకొని విరిగిన కాలు

  •      పట్టించుకోని పోలీసులు

  •      ఆరు నెలలు ఇక మంచమే గతి

  •      ఆవేదనలో బాధితుడు

  • తిరుపతి క్రైం: ఏదైనా వాహనం ఢీకొని కాలు విరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. పోలీసు వాహనం ఢీకొని కాలు విరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? పెట్రోలింగ్ వాహనంలో వెళుతున్న పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఆటో డ్రైవర్ కాలు విరిగింది. ఆరు నెలలు అతను మంచానికే పరిమితం కావలసి వస్తోంది. అతని కుటుంబం జీవనోపాధి కోల్పోయింది. పోలీసులు ఆదుకోకపోగా కేసు కూడా నమోదు చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే సైతం వీరి గోడు పట్టించుకోలేదు. దీంతో వీరి కుటుంబం ఆవేదన చెందుతోంది.



    బాధితుడు గుణశేఖర్ కథనం మేరకు.. గుణశేఖర్, మునెమ్మ దంపతులు ఇద్దరు పిల్లలతో కలసి తిరుపతి రాజీవ్‌నగర్ క్రాంతినగర్‌లో అద్దె ఇంటిలో ఉంటున్నారు. గుణశేఖర్ ఆటోను అద్దెకు నడిపేవాడు. జూన్ 25వ తేదీ ఆరోగ్యం బాగోలేక గుణశేఖర్ ఆస్పత్రికి వెళ్లాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో బైక్‌లో ఇంటికి  బయలుదేరాడు. సత్యనారాయణపురం సర్కిల్ వద్ద ఏపీ 03ఎజి. 3092 నెంబరు పోలీస్ పెట్రోలింగ్ వాహనం ముందుకెళ్లింది. అందులోని కానిస్టేబుళ్లు కుడివైపు డోరు తీయడంతో వెనకే వస్తున్న గుణశేఖర్‌కు తగిలి పక్కనే ఉన్న పెద్ద బండరాయిపైన పడ్డాడు.



    అతని కుడికాలు విరిగింది. పోలీసులు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. భార్య మునెమ్మ భర్తను రుయా ఆస్పత్రికి తీసుకెళ్లింది. కుడికాలుకు 26 కుట్లు పడ్డాయి. ఆరు నెలలపాటు గుణశేఖర్ బెడ్‌రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలిపారు. మరుసటి రోజు గుణశేఖర్ భార్య అలిపిరి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ‘‘మీ భర్తను ఢీకొంది పోలీస్ జీపే కదా.. మీరు ఫిర్యాదు ఇచ్చినా కాగితాన్ని చింపేస్తాం. వెళ్లు ఇక్కడి నుంచి’’ అంటూ విధుల్లో ఉన్న ఎస్‌ఐ గణేష్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.



    ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. డీ ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకుంది. మాట్లాడి న్యాయం చేస్తామంటూ ఆయన జీపెక్కి వెళ్లిపోయారు. పోలీసులు పట్టించు కోకపోవడంతో వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ రాజేంద్రను బాధితులు ఆశ్రయించారు. వారు అలిపిరి పోలీసులను కలసి పోలీస్ జీపు ఢీకొని గాయపడిన గుణశేఖర్‌కు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడంతో పాటు కేసు నమోదు చేయాలని కోరారు.



    ఈ నేపథ్యంలో ఈనెల 21వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయమై గుణశేఖర్, భార్య మునెమ్మ ఎమ్మెల్యే వెంకటమరణ వద్దకు వెళ్లారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇవ్వన్నీ ఎందుకంటూ ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పా రు. ఇప్పటికైనా పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top