బెదిరింపులకిది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదు

బెదిరింపులకిది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదు - Sakshi


తప్పులు ఎత్తి చూపితే {పతిపక్షానికి బెదిరింపులా?

‘ఓటు కోట్లు’పై ఎందుకంత ఉలికిపాటు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ధ్వజం


 

హైదరాబాద్: ఓటుకు కోట్లుపై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందో చెప్పాలని పలువురు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆర్కే రోజా, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్దన్‌రెడ్డి, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, గిడ్డు ఈశ్వరి, విశ్వేసరాయి కళావతి, వంతల రాజశ్వేరి, దేశాయి తిప్పారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నారాయణస్వామి, పీడిక రాజన్నదొర, కంబాల జోగులు, ఎం.సునీల్ కుమార్, కిదారి సర్వేశ్వరరావు, వై.విశ్వేశ్వరరెడ్డి, గుమ్మనూరు జయరాములు మాట్లాడారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. అనేక కుంభకోణాలతో పాటు చంద్రన్న కానుక వంటి సంక్షేమ పథకాల్లో వందల కోట్లు కొల్లగొట్టి తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్లు కొనుగోలు చేయాలన్న చంద్రబాబు దుర్మార్గపు ప్రయత్నాన్ని దేవుడు బట్టబయలు చేశాడన్నారు. బెదిరింపులకు పాల్పడడానికి అసెంబ్లీ.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదని,  జగన్ నేతృత్వంలో ప్రజా సమస్యలపై తాము అలుపెరగని పోరాటం చేస్తామన్నారు.



ఉలికిపాటెందుకు?: రోజా

ఓటుకు కోట్లు కేసుపై అసెంబ్లీలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇస్తే టీడీపీ ఎందుకు ఉలిక్కిపడుతోందని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.తామిచ్చిన తీర్మానంపై టీడీపీ నేతలు షాక్ కొట్టిన కాకుల్లా గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కేసు కోర్టులో ఉన్నందున చర్చించబోమని సభాపతి చెప్పడాన్ని తప్పుపడుతున్నామన్నారు.కాగా  కోర్టులో ఉన్న  జగన్ కేసుల గురించి టీడీపీ నాయకులు రోజూ మాట్లాడుతుంటే ఆయన మౌనంగా ఉండడం బాధాకరమని రోజా అన్నారు.ఓటుకు కోట్లు కేసులో యాక్షన్ రేవంత్ రెడ్డిది అయితే సూత్రధారి సీఎం చంద్రబాబేననీ ఆయన హయాంలో రాష్ట్రంలో ప్రజాపరిపాలన జరగడం లేదనీ  ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి  విమర్శించారు.



వణికిపోతున్న బాబు..: చెవిరెడ్డి

 ‘ఓటుకు కోట్లు కేసు అంశంలో చంద్రబాబు వణికిపోతున్నారు. సొంత రాష్ట్రంలో తప్పించుకొని పక్క రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ బాబు. ఆయన దొంగతనాలు, దొంగ బుద్ధి సొంత రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా చూపించారు. ఏపీ పరువును నిలుపునా తీశారు.  చంద్రబాబు లాంటి అవినీతి పరుడు రాష్ట్రంలో ఎవరూ లేరు.’ అని చెవిరెడ్డి విమర్శించారు.



 అసెంబ్లీలో ఉండీ సభకు ఎందుకు రాలేదు?

అసెంబ్లీలో ఉండి కూడా చంద్రబాబు సభకు రాలేదని, ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఎమ్మెల్యేలు ఎస్వీమోహన్‌రెడ్డి, అత్తార్ చాంద్‌బాషాలు ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసును పురస్కరించుకుని 36 రోజులు సచివాలయానికి ముఖ్యమంత్రి రాలేదంటే రాష్ట్రం పరువుకు సంబంధించిన అంశమని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఢిల్లీ వెళ్లినప్పడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామనగానే అక్కడివాళ్లు ‘వాట్ ఐ యామ్ సేయింగ్’ అని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top