దాహం.. దాహం


జ దొరవారిసత్రం మండలం మీదూరు, కారికాడు, వేలికాడు, నాగినేరి గ్రామాల ప్రజలు ఐదేళ్లుగా మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో మంచినీరు దొరక్కపోవటంతో గ్రామస్తులు బీడు భూముల్లో పదడుగులు గుంత తవ్వి అందులో ఊట నీరుని చేదుకుని తాగుతున్నారు. జ తనియాలి గ్రామస్తులు కిలోమీటర్ల దూరం వెళ్లి అవస్థలు పడి నీరు తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామాల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి పథకం ఉన్నా ప్రయోజనం లేదు. నీరుంటే కరెంటు ఉండదు.. కరెంటు ఉంటే.. గ్రామాలకు నీరుచేరే పరిస్థితి కనిపించలేదు.

 జ ఈ విషయంపై జెడ్పీటీసీ సభ్యురాలు ఎం. విజేత అధికారులను అడిగినా స్పందించలేదు. సోమవారం జరిగిన మం డల సర్వసభ్య సమావేశంలో ఆమె తాగునీటి సమస్యపై ఇరిగేషన్ అధికారులను నిలదీయటం ఇందుకు నిదర్శనం.  

 - సాక్షి ప్రతినిధి, నెల్లూరు

 

 ఇది ఒక్క దొరవారిసత్రం మండలంలోనే కాదు జిల్లాలో అనేక గ్రామాల్లో పలు కారణాలతో ప్రజలకు మంచినీరు అందటం లేదు. సుదూరు ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయ బోర్ల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ట్యాంకర్లను కొనుగోలు చేసుకుంటూ నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. జిల్లాలో 940 గ్రామ పంచాయతీల్లో.. 30 లక్షల జనాభా ఉన్నారు. వీరికి మంచినీరు సరఫరా చేసేందుకు 16,484 చేతిపంపులు ఉన్నాయి.

 

 అయితే ఇందులో సుమారు 9 వేలకుపై చేతిపంపులు పనిచేయటం లేదని సమాచారం. వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు పడిపోవటంతో నీరులేక మరికొన్ని చేతిపంపులు నిరుపయోగం దర్శనమిస్తున్నాయి. 2,877 రక్షిత మంచినీటి పథకాలు ఉంటే సగం కూడా పనిచేయటం లేదనే విమర్శలు ఉన్నాయి. 32 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలున్నా ప్రయోజనం సున్నా.. అని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటి నిర్వహణకు ఏటా రూ.220 కోట్లు నిధులు కేటాయిస్తున్నా.. అధికశాతం నిధులు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పాలకులు పట్టించుకోకపోవటం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి పల్లెజనానికి గుక్కెడు మంచినీరు దొరకటం కరువైంది. ప్రస్తుతం పనిచేయని చేతిపంపుల మరమ్మతుల కోసం రూ.75 లక్షలు, మంచినీటిని రవాణా చేసేందుకు రూ.2.50 కోట్లు అవసరమని అధికారులు నివేదికలు పంపినట్లు తెలిపారు.

 

 198 గ్రామాల్లో నీటి ఎద్దడి

 జిల్లాలో 46 మండలాల పరిధిలోని 198 గ్రామాల్లో మార్చి మొదటివారంలోనే మంచినీటి ఎద్దడి నెలకొంది. వేసవి రాకముందే మంచినీటి కోసం గ్రామస్తులు సుదూరు ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. స్థానికులు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలున్నాయి. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 27 గ్రామాల ప్రజలకు మంచినీరు అందటం లేదు.

 

  కోవూరు నియోజకవర్గ పరిధిలో 15 గ్రామాలు, సర్వేపల్లిలో 8 గ్రామాలు, కావలిలో 18, ఉదయగిరి పరిధిలో 48, గూడూరు పరిధిలో 10, సూళ్లూరుపేట పరిధిలో 18, ఆత్మకూరు పరిధిలో 54 గ్రామాల్లో మంచినీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఆత్మకూరు, సూళ్లూరుపేట, కావలి, సర్వేపల్లి గూడూరు ఎమ్మెల్యేలు సొంత నిధులు కొంత వెచ్చించి అక్కడక్కడా మంచినీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయలేదని సమాచారం.

 

 పురోగతిలేని మంచినీటి పథకాలు

 జాతీయ గ్రామీణ మంచినీటి పథకం, ఆర్‌డబ్ల్యూఎస్ కింద జిల్లాలో 373 పనులు చేపట్టారు. ఇందులో 94 పనులు పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 279 పనుల్లో పురోగతి లేదు. దీంతో 154 పనులను రద్దుచేసినట్లు సమాచారం. అదేవిధంగా జాతీయ గ్రామీణ మంచినీటి పథకం కింద రూ.88.27 కోట్లతో 21 ప్రాజెక్టులు చేపట్టగా... రెండింటిని మాత్రం పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు.

 

 ఎటువంటి పురోగతిలేని 11 ప్రాజెక్టులను రద్దుచేశారు. ఇంకా 13వ ఆర్థిక సంఘం నిధులు, జెడ్పీ, ఎంపీ, ఏసీడీపీ, సీఆర్‌ఎఫ్ కింద చేపట్టిన పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. దీనంతటికీ నిధులు విడుదల చేయకపోవటమే కారణమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి మంచినీటి సమస్య పరిష్కారానికి కృషిచేయాల్సిన అవసరం ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top