వారు దొరికారు

వారు దొరికారు - Sakshi


సునీల్..  ఈ పేరు చెబితే చాలు వణకు పుడుతుంది.. ఫోన్‌లో బెదిరించడం.. మాట వినకుంటే కిడ్నాప్ చేయడం.. అవసరమైతే డబ్బు కోసం చంపడం.. ఇదీ ఇంతకాలం సునీల్ గ్యాంగ్ చేసిన దందాలు. ఇలాంటి ఎన్నో దందాలు చేసిన సునీల్ ఇప్పుడు జైల్లో ఉచలు లెక్కబెడుతున్నాడు. అయితే సునీల్ చూపిన మార్గాన్ని మాత్రం చాలా మంది కొనసాగిస్తున్నారు. బ్రాండ్ నేమ్‌లా సునీల్ పేరు చెప్పుకుంటూ పలువురు ప్రొద్దుటూరులో బెదిరింపులకు పాల్పడుతున్నారు.     - ప్రొద్దుటూరు క్రైం

 

 సునీల్ గ్యాంగ్ పేరుతో గతంలో ఓ డాక్టర్‌కు ఫోన్ చేసి డబ్బు కావాలని కొందరు బెదిరించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన ఇంకా మరచిపోకనే తాజాగా ఓ వ్యాపారిని బెదిరించిన సంఘటనలో సుగమంచిపల్లెకు చెందిన యోహాన్, ప్రొద్దుటూరు కాల్వకట్ట వీధిలో నివాసముంటున్న రామకొండయ్యను ఆదివారం ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాటి వివరాలను స్థానిక డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి విలేకరులకు తెలిపారు.

జమ్మలమడుగు మండలం సుగుమంచుపల్లికి చెందిన యోహాన్ కూలి చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పట్టణంలోని కాల్వకట్టవీధికి చెందిన రామకొండయ్య ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. కొన్నేళ్ల కిందట జరిగిన ఫైనాన్షియర్ పోట్లదుర్తి రమణారెడ్డి హత్య కేసులో వీరిద్దరూ నిందితులు. అప్పట్లో డబ్బులు తీసుకొని రమణారెడ్డిని దారుణంగా హతమార్చారు. అప్పట్లో పోలీసులు అరెస్టు చేసి వీరిద్దరినీ జైలుకు పంపారు. అదే వారికి కలిసొచ్చింది. అప్పటికే జైల్లో ఉంటున్న సునీల్‌తో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. తను చేసిన కిడ్నాప్‌ల గురించి సునీల్ వారికి వివరించాడు. ఎలా బెదిరించాలి, ఎలాంటి వాళ్లను ఎంచుకోవాలన్న దానిపై సునీల్ చెప్పిన మాటలు వారిలో ఆలోచనను రేకెత్తించాయి. బెయిల్‌పై వచ్చాక యోహాన్, రామకొండయ్య సునీల్ చూపిన బాటలోనే నడవడం మొదలుపెట్టారు.  

 ఫ్రూఫ్ లేని సిమ్ కార్డుల కోసం అన్వేషణ

 సునీల్ చెప్పిన సూచనల మేరకు అడ్రస్ ఫ్రూఫ్‌లు లేని సిమ్‌కార్డుల కోసం అన్వేషణ సాగించారు. జమ్మమలడుగులో ఉంటున్న యోహాన్ బంధువు రాబర్ట్ సెల్‌పాయింట్ నిర్వహిస్తున్నాడు. రాబర్ట్ వద్దకు వెళ్లిన యోహాన్ ఫ్రూఫ్‌లెస్ సిమ్‌కార్డులు కావాలని అడిగాడు. ముందుగా లేవని చెప్పిన రాబర్ట్ తర్వాత అతనికి రెండు సిమ్ కార్డులు ఇచ్చాడు. అప్పటి నుంచి రంగంలోకి దిగిన యోహాన్, రామకొండయ్య ఆ సిమ్‌కార్డుతో పలువురికి ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టారు. ముందుగా ప్రొద్దుటూరుకు చెందిన మేడా చంద్రశేఖర్ అనే వ్యక్తికి ఫోన్ చేశారు. ‘నిన్ను ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేయాలని చూస్తోంది. ఈ విషయం మాకు తెలిసి నీకు ఫోన్ చేస్తున్నాం. జాగ్రత్తగా ఉండు’ అని చెప్పారు. కొద్ది సేపటి తర్వాత మళ్లీ అతనికే ఫోన్ చేసి ‘నీకు విలువైన సమాచారం చెప్పి సాయం చేశాం కదా.. మాకు కొంత డబ్బు కావాలి’ అని అడిగారు. అందుకు చంద్రశేఖర్ వారికి రూ.8 వేలు ఇచ్చాడు. తర్వాత వైఎంఆర్ కాలనీలో నివాసముంటున్న హోల్‌సేల్ వ్యాపారి కొప్పర్తి ప్రతాప్‌కు ఈ నెల 19న వారే ఫోన్ చేసి ‘మేం సునీల్ గ్యాంగ్ సభ్యులం. మాకు రూ.5 లక్షలు కావాలి.. లేదంటే నిన్ను చంపేస్తాం.. ఇస్తావా లేదా’ అని బెదిరించారు. వారి ఫోన్ రాకతో భయపడ్డ ప్రతాప్ ‘నా వద్ద అంత డబ్బు లేదు’ అని చెప్పడంతో రూ. 50 వేలైనా ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు. చివరకు రూ. 40 వేలు ఇచ్చేందుకు ప్రతాప్ అంగీకరించారు. ఆ డబ్బును తన గుమాస్తా రామ్మోహన్‌రెడ్డి ద్వారా 19న సాయంత్రం పంపించాడు. అతని వద్ద డబ్బు తీసుకున్న యోహాన్, రామకొండయ్య ‘ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని’ బెదిరించారు. వారికి డబ్బు ఇచ్చిన ప్రతాప్ భయంతో ఎవరికీ చెప్పలేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచన మేరకు 20న వన్‌టౌన్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సీఐ మహేశ్వరరెడ్డి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 






 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top