రెస్క్యూ రిస్కే


ఒంగోలు టౌన్ : బాలల హక్కుల రక్షణ, సంరక్షణకు కృషి చేస్తున్న కమిటీలకు కొత్త సమస్య వచ్చిపడింది. బాలల హక్కులకు విఘాతం కలిగినా, బాల కార్మికులు ఉన్నా వారిని అక్కడి నుంచి విముక్తులను చేసి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించేందుకు కమిటీలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. బాలల హక్కులకు భంగం కలుగుతోందని సమాచారం అందుకున్న కమిటీలు అక్కడకు వెళ్లి రెస్క్యూ చేసినా వారికి షెల్టర్ కల్పించడంలో రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయి. గతంలో జిల్లాలో గవర్నమెంట్ హోమ్ ఉండేది. ఆ హోమ్ ఉన్నంతకాలం బాలల హక్కులపై పనిచేస్తున్న కమిటీలు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్న బాలలు ఉంటే వెంటనే వారిని ఆ హోమ్‌లో చేర్పించేవారు.



గవర్నమెంట్ హోమ్‌ను ఎత్తివేయడంతో రెస్క్యూ చేసి తీసుకొచ్చిన బాలలను ఉంచేందుకు గవర్నమెంట్ హోమ్ లేకపోవడంతో ఎన్‌జీఓ హోమ్సే దిక్కయ్యాయి. బాలల హక్కుల రక్షణ, సంరక్షణకు సంబంధించి రెండు కమిటీలు పనిచేస్తున్నాయి. బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో చైల్డ్‌లైన్(1098) ప్రతినిధులు, మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐసీపీఎస్ సిబ్బంది సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగుతున్నారు. బాల్య వివాహాలను నియంత్రించడంతో పాటు ఎక్కడైనా బాల కార్మికులు ఉన్నా, ఇంటి నుంచి అలిగి పారిపోయి వచ్చినా, తప్పిపోయిన బాలల కోసం ఈ కమిటీలు పనిచేస్తుంటాయి. 2007లో బాలల సంక్షేమ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్‌కు మేజిస్ట్రేట్ పవర్స్ కలిగి ఉంటాయి.



బాలల హక్కులకు భంగం కలిగినా, వారు ఇబ్బంది పడుతున్నా సంబంధిత కమిటీల సభ్యులు వారిని తీసుకొచ్చి బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ ఎదుట హాజరు పరచాల్సి ఉంటుంది. బాలల సంక్షేమ కమిటీ ఎదుట హాజరు పరచిన తర్వాత చైర్మన్  ఆదేశాల మేరకు ఆ బాలలను తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తారు. అందుకోసం రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో గవర్నమెంట్ హోమ్‌ను ఏర్పాటు చేశారు. చైల్డ్‌లైన్(1098) ఏర్పడిన 2012 సెప్టెంబర్ నుంచి 2013 ఏప్రిల్ వరకు 162 మంది బాలలను గుర్తించి గవర్నమెంట్ హోమ్‌కు తరలించారు. అందులో వారికి ఉచిత భోజన వసతి కల్పిస్తారు. బాలల తల్లిదండ్రులు, బంధువులు బాలల సంక్షేమ కమిటీ చైర్మన్‌ను కలిసి ఇకముందు తమ పిల్లలను బాల కార్మికులుగా లేదా హింసకు గురిచేయమం టూ వేడుకొని తమ ఇళ్లకు తీసుకెళ్తారు.



ఇతర హోమ్‌లే ఆధారం

రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్‌కు నిధులు సరిగా విడుదల చేయకపోవడంతో ఎనిమిది నెలలపాటు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత దాన్ని ఎత్తివేయడంతో రెస్క్యూ చేసి తీసుకువచ్చిన బాలలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు కమిటీలు అష్టకష్టాలు పడుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఏడు ఎన్‌జీఓ హమ్‌లు నడుస్తున్నాయి. బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ ఆదేశాల మేరకు ఆ ఎన్‌జీఓ హోమ్‌ల్లో బాలలను చేర్పిస్తున్నప్పటికీ ఎంతకాలం వారిని ఈ విధంగా వాటిలో ఉంచుతారన్న ప్రశ్న వినిపిస్తోంది. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో హోమ్‌ను ఎత్తివేసిన తర్వాత నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 136 మంది బాలలను గుర్తించి ఎన్‌జీఓ హోమ్స్‌కు తరలించారు.



మే నుంచి నవంబర్ వరకు 51మంది బాలలను గుర్తించి ఎన్‌జీఓ హోమ్స్‌కు తరలించారు. బాల కార్మికులు, ఇళ్లల్లో నుంచి పారిపోయి వచ్చేవారు, తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన వారి సంఖ్య పెరిగిపోతున్నా గవర్నమెంట్ హోమ్ లేకపోవడంతో వారికి తాత్కాలిక ఆశ్రయం పూర్తి స్థాయిలో కల్పించలేకపోతున్నారు. ఇటీవల జరిగిన బాలల హక్కుల దినోత్సవంలో గవర్నమెంట్ హోమ్ లేని విషయాన్ని కలెక్టర్ విజయకుమార్ దృష్టికి బాలల సంక్షేమ కమిటీలు తీసుకొచ్చాయి. గవర్నమెంట్ హోమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆ హామీ కార్యరూపం దాల్చే వరకు బాలల హక్కుల కోసం పనిచేసే కమిటీలకు కష్టాలు తప్పేలా లేవు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top