ఆకలి సైరన్‌లు!


 సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో పారిశ్రామిక అశాంతి నెలకొంది. ముఖ్యమైన పరిశ్రమలు మూతపడుతున్నాయి.  ఉపాధి కోల్పోయి వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కార్మికశాఖ, ఇతర ఉన్నతాధికారులు   తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులైతే కనీసం పట్టించుకోవడం లేదు. ఎంతసేపూ ఆధిపత్యం కోసం కుమ్మలాడుకోవడం, పరస్పరం దెబ్బతీసుకోడానికే సమయమంతా వెచ్చిస్తున్నారు.  ఎన్నుకున్న ప్రజల వెతల్ని పరిష్కరించేందుకు చొరవచూపడం లేదు. ఈ పరిస్థితుల్లో వలసపోవడం తప్ప కార్మికులకు మరో గత్యంతరం లేదు.     టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో కొత్తగా పరిశ్రమలు రాలేదు సరికదా ఉన్న పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జిల్లాలో ప్రధానమైన  జూట్, ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలతో పాటు ఇతర చిన్న పరిశ్రమలు కలిపి  దాదాపు 15 వరకూ మూతపడ్డాయి. 30 వేలకు పైగా కుటుంబాలు ఆకలితో ఆలమటిస్తున్నాయి.

 

 అత్యధిక మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న విజయనగరం ఈస్ట్‌కోస్ట్, అరుణా, బొబ్బిలి శ్రీలక్ష్మీ జ్యూట్‌మిల్లులను మూసేశారు. వీటిపై దాదాపు 20వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.   జిల్లాలో ప్రధానమైన ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలు ఒక్కొక్కటిగా లాకౌట్ అవుతున్నాయి. గరివిడి ఫేకర్ పరిశ్రమ మూతపడి పది నెలలు దాటిపోయింది. దీనిపై ఆధారపడిన రెండువేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అలాగే, బొబ్బిలిలోని యోనా ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమ మూతపడి రెండేళ్లయింది. గుర్ల మండలంలోని జయలక్ష్మీ ఫెర్రో అల్లాయీస్  మూతపడి దాదాపు పది నెలలైంది.  వీటితో పాటు గుర్ల మండలం పెద బంటుపట్లలిలోని స్వస్తిక్ ఫెర్రో అల్లాయీస్, మెరకముడిదాం మండలంలోని ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలు ఇటీవల మూతపడ్డాయి. వీటిన్నింటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 10 వేల కార్మిక కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.

 

 ఒక పరిశ్రమకు విద్యుత్, మరో పరిశ్రమకు ముడి సరుకులు, ఇంకో పరిశ్రమకు వేగన్ సమస్య, ఇంకొన్ని పరిశ్రమల్లో యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య నెలకున్న సమస్యలు ఉన్నాయి.       నెలల తరబడి మూతపడి ఉన్న పరిశ్రమల్ని గత ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోలేదు కనీసం అధికారంలోకి వచ్చిన టీడీపీయేనా తెరిపిస్తుందని కార్మికులు ఆశించారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి.  మూతపడిన పరిశ్రమలు తెరుచుకోకపోగా మరికొన్నింటికి  తాళాలు పడ్డాయి.   ఇక కొత్త పరిశ్రమల ఊసే లేదు. దీన్నిబట్టి  పారిశ్రామిక రంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు.    పరిశ్రమలు మూతపడటంతో కార్మికులు రోడ్డున పడి పస్తులతో ఆలమటిస్తుంటే, వారి ఆకలి కేకలు అటు అధికారులకు, ఇటు పాలకులకు కనీసం పట్టడం లేదు. ఎంతసేపూ అంతర్గత, ఆధపత్య పోరుతో కాలయాపన చేయడం తప్ప మూతపడ్డ పరిశ్రమలను తెరిచే ప్రయత్నం చేయడం లేదు.

 

 రెండు వర్గాలుగా విడిపోయి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు.  ఇక, ద్వితీయశ్రేణి ప్రజాప్రతినిధులు, నాయకులైతే అవకాశం చిక్కిన ప్రతీచోటా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇసుకను ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకున్నారు.   దాదాపు 30వేల మంది కార్మికుల బతుకుల్లో చీకట్లు కమ్ముకోగా, వారికి చీమైనా కుట్టినట్టు   లేదు. అసలు పరిశ్రమలెందుకు మూతపడుతున్నాయ్? కారణాలేంటి? ఏం చేస్తే తెరుచుకుంటాయి? తీసుకోవల్సిన చర్యలేంటి? అనేదానిపై ఆరాతీసే నాథుడు కన్పించడం లేదు. కార్మికులు ఘోషిస్తున్నా   పట్టించుకోవడం లేదు. ఆందోళనలు చేస్తున్నా స్పందించడం లేదు.  తప్పనిపరిస్థితుల్లో పొట్టకూటి కోసం వలసపోతున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు కొనసాగితే వలసల్లో జిల్లా అగ్రస్థానంలోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top