కర్నూలులో వాలంతరి నిర్మాణం లేనట్లే


కర్నూలు రూరల్: వడ్డించేవాడు మన వాడైతే కడ బంతిలో కూర్చున్నా పంచభక్షపరమన్నాలు దొరుకుతాయనే చందంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కరువు ప్రాంతంలో రైతులకు ఉపయోగపడాల్సిన వాటర్ అండ్ లాండ్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (వాలంతరి) రీజినల్ కేంద్రాన్ని కోస్తా ప్రాంతానికి తరలించేందుకు యత్నిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. వర్షాభావ పరిస్థితులతో ప్రతి ఏటా జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.



 ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులపై రైతులకు సలహాలు ఇచ్చేందుకు వాలంతరి రీజినల్ కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అప్పట్లో చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన టీజీ వెంకటేష్ నిధులు మంజూరు చేశారు. గతేడాది జూన్ 22వ తేదీన కర్నూలు శివారులోని పంచలింగాల గ్రామ సమీపంలో శంకుస్థాపన కూడా చేశారు.



 గత ప్రభుత్వం ఇచ్చిన రెండు కోట్ల రూపాయల్లో 4.5 ఎకరాల భూ సేకరణకు రూ. 45 లక్షలు రెవెన్యూ శాఖకు చెల్లించారు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమ కారణంగా నాలుగైదు నెలలు ఎలాంటి పురోగతి లేకపోవడంతో భూ సేకరణకు చెల్లించిన మొత్తం పోను మిగిలిన సొమ్మును నీటి పారుదల శాఖ అధికారులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించారు.



 ప్రతిపాదనలు బుట్టదాఖలు..

 వాలంతరి రీజినల్ కేంద్రానికి అవసరమైన భవన నిర్మాణం, సమావేశ మందిరం, వసతి గృహాలు తదితర వాటి కోసం ఇరిగేషన్ అధికారులు కసరత్తు చేసి రూ. 13.5 కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ ప్రతిపాదనల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కర్నూలులో వాలంతరి నిర్మించేందుకు అయిష్టత చూపుతోంది.



కోస్తా ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతానికి చెందిన మంత్రుల ఒత్తిడి చేస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో గత కేబినెట్ ఆమోదించిన దాన్ని రద్దు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కర్నూలులో చేపట్టాల్సిన వాలంతరి కేంద్రాన్ని కృష్ణా జిల్లాకు తరలించేందుకు నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఇటీవలే ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై మాజీ మంత్రి టీజీ వెంకటేష్ స్పందించి.. మరో ప్రాంతానికి ఈ కేంద్రాన్ని తరలించవద్దని మంత్రికి లేఖ రాసినట్లు నీటి పారుదల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి.



 రాయలసీమ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయకుండా కోస్తా ప్రాంత నేతలు అడ్డు తగులుతున్నట్లు విమర్శలున్నాయి. కృష్ణానది పరివాహక యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని సూచనప్రాయంగా చెప్పింది. అయినా పట్టించుకోకుండా కోస్తా ప్రాంత అధికార పార్టీ నేతలు కృష్ణా బోర్డును విజయవాడలో ఏర్పాటు చేసేందుకు సీఎంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, టీడీపీ ఎమ్మెల్యేలు స్పందించకుంటే సీమ రైతులకు తీరని అన్యాయం చేసినవారవుతారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top